
పాత నేరస్తులపై నిరంతరం నిఘా
మహబూబ్‌నగర్ క్రైం: పాత నేరస్తులు గతంలో చేసిన తప్పులు భవిష్యత్‌లో చేయకుండా మంచి సత్ప్రవర్తనతో ఉండాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి గొడవలు, అలర్లకు పాల్పడకూడదని ఎస్పీ జానకి అన్నారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పాత నేరస్తులకు గురువారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించడంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు పదిలంగా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ అప్ప య్య, ఎస్‌ఐ శీనయ్య తదితరులు పాల్గొన్నారు.
శిథిల ఇళ్లలో ఉండరాదు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి ఆమె పోలీస్ అధికారులతో వీసీ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఎవరూ ఉండరాదని, వాగులు, చెరువులు, నదుల దగ్గరకు వెళ్లరాదన్నారు. ప్రధానంగా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. దుందుభీ, కోయిల్‌సాగర్, జిన్నారం, గొండ్యాల, రంగారెడ్డిపల్లి, దాదాపూర్, ఎర్రకుంట, కొత్త చెరువు, ట్యాంక్‌బండ్, రైల్వే అండ్ బ్రిడ్జిల దగ్గరకు వెళ్లరాదన్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియోలు తీయడానికి ప్రయత్నించవద్దన్నారు. వాహనదారులు వర్షం పడుతున్న సమయంలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, రోడ్లపై నెమ్మదిగా వాహనాలు నడపాలని, రోడ్లపై గుంతలను జాగ్రత్తగా గమనించాలని చెప్పారు.