
మహేష్ మృతదేహం మూలమళ్ల వద్ద లభ్యం
అమరచింత: జూరాల ప్రాజెక్టు రహదారిపై ఆదివారం జరిగిన కారు, బైక్ ప్రమాదంలో నదిలో పడి గల్లంతయిన మహేష్ (23) మృతదేహం ఆత్మకూర్ మండలంలోని మూలమళ్ల శివారులోని కృష్ణానది ఒడ్డున బుధవారం లభ్యమైంది. మహేష్ మృతికి కారణమైన వారిని చట్టపరంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతుడి బంధువులు ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్‌ఐ శ్రీహరి ఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడారు. తమకు తక్షణమే న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో ఎస్‌ఐ జోక్యం చేసుకుని అనుమతి లేకుండా రాస్తారోకో చేస్తే కేసులు నమోదవుతాయన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని మృతుడి కుటుంబ సభ్యులకు వివరించారు. పరిహారం గురించి కోర్టులో మాట్లాడుకోవాలని, ఇలా రోడ్డుపై రాస్తారోకో చేయడం సరికాదన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
న్యాయం చేయాలని ప్రాజెక్టుపై
బంధువుల ఆందోళన