
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
గద్వాల క్రైం: గోదాంలో నిల్వ చేసిన రూ.18 లక్షల విలువైన సిగరెట్లను అపహరించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వివరించారు. అయిజ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వినయ్‌కుమార్ రెండేళ్లుగా అయిజలో విజయలక్ష్మి ఏజెన్సీ ఏర్పాటుచేసి సిగరెట్ల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ నెల 11న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏజెన్సీ సముదాయంలో నిల్వ చేసిన సిగరెట్ డబ్బాలను అపహరించారు. ఈ ఘటనపై బాధితుడు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని పలు బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
● రాజస్థాన్‌లోని పైలా జిల్లా బితులాకు చెందిన రతన్‌లాల్, జలోర్ జిల్లాకు చెందిన బీర్బల్ బిష్ణయ్, గుణదేవ్ గ్రామానికి చెందిన జగదీష్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. ఈ నెల 11న కారులో కర్ణాటకలోని బెల్గాం నుంచి అయిజకు కారులో వచ్చారు. పట్టణంలోని విజయలక్ష్మి ఏజెన్సీ ద్వారా భారీ మొత్తంలో సిగరెట్ల వ్యాపారం కొనసాగుతుందని గుర్తించి అదేరోజు అర్ధరాత్రి దుకాణ సముదాయం నుంచి రూ.18 లక్షల విలువైన సిగరెట్ కాటన్ డబ్బాలను కారులో వేసుకొని ఎరిగెర మీదుగా రాయచూర్‌కు చేరుకున్నారు. దొంగిలించిన సిగరెట్ బాక్స్‌లను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు 21వ తేదీన శాంతినగర్ సీఐ టాటాబాబు ప్రత్యేక బృందంతో రాయచూర్‌కు వెళ్లగా పట్టణ శివారులో సిగరెట్ బాక్సులతో ఉన్న కారు, రతన్‌లాల్, జగదీష్ కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారన్నారు. బీర్బల్ విష్ణయ్ పరారీలో ఉన్నారని ఇద్దరు నిందితులతో పాటు రూ.15 లక్షల విలువైన సిగరెట్ బాక్సులు, రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. నిందితులను మంగళవారం గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, నాగశేఖర్‌రెడ్డి, అబ్దుల్ షుకూర్, సిబ్బంది రంజిత్, ప్రసాద్, గోవింద్, రవికుమార్, శ్రీను ఉన్నారు. కేసును చేధించిన సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక క్యాష్ రివార్డులను అందజేశారు.
రూ.15 లక్షల విలువైనసిగరెట్లు, కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన జోగుళాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్