
రైలు ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం
మక్తల్: రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన కోనేమోల బాల్‌రాజ్(56) గ్రామ సమీపంలో రైలు పట్టాల వద్ద గొర్రెలు కాపు కాస్తుండగా రైలుపట్టాల మీద ఉన్న గొర్రెలను తరలిస్తుండగా రైలు ఢీకొనడంతో తల ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య గోవిందమ్మ, కూమారుడు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
ధరూరు: క్షణికావేశంలో పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోతులగిద్దలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొప్పలి నర్సింహులు(35) మండల కేంద్రంలో టీస్టాల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14న తన వ్యవసాయ పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు గద్వాల ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. పేకాట, మద్యానికి బానిసై పలుమార్లు హెచ్చరించినా మార్పు రాకపోగా క్షణికావేశంలో పురుగు మందు తాగినట్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య బొప్పల హేమలత ఫిర్యాదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం నర్సింహులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
అడ్డాకుల: మూసాపేట మండలం వేములకు చెందిన అంజలి (30) హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన అంజలి కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంటి వద్ద గడ్డి మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి అటు నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అంజలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
హత్యాయత్నం కేసులో రిమాండ్
మరికల్: పాతకక్షల నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందుతుడిని రిమాండ్‌కు తరలించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఈ నెల 19న రాత్రి మరికల్‌లో లంబడి వెంకటేష్‌పై బొండాల మల్లేష్ అనే వ్యక్తి కొబ్బరి బొండాల కత్తితో దాడిచేసి పరారయ్యడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని పెద్దచెరువు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సీఐ రాజేందర్‌రెడ్డి నిందుతుడిని కోస్గి కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాము, ప్రత్యేక పోలీస్ టీమ్ పాల్గొన్నారు.
రెండోరోజూ గాలింపు.. లభించని ఆచూకీ
ధరూరు: జూరాల ప్రాజెక్టులో గల్లంతైన మహేష్ ఆచూకీ కోసం రెండోరోజు మంగళవారం ఉదయం నుంచి రేవులపల్లి పోలీసులు, జాలర్లు, రెస్క్యూ టీం సభ్యులు గాలింపు చేపట్టారు. ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ముందు భాగంలో అడుగడుగునా గాలించారు. జల విద్యుత్ కేంద్రం వైపు గేట్లు మూసి అటు ఆత్మకూర్ వైపు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం పొద్దుపోయే వరకు గాలింపు కొనసాగినట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు.

రైలు ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం