
వివాహేతర బంధమే ప్రాణం తీసింది
కొల్లాపూర్: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దామోదర్‌గౌడ్(48) హత్యకు వివాహేతర బంధమే కారణమని నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను మంగళవారం కొల్లాపూర్ సీఐ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 11న రాత్రి దామోదర్‌గౌడ్ ఇంటిపై పడుకుంటానని భార్య నిర్మలకు చెప్పి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు దామోదర్‌గౌడ్ కనిపించకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తెలిసిన వారికి భార్య నిర్మల ఫోన్ చేసింది. ఎంతకూ ఆచూకీ తెలియకపోవడంతో 13న పెద్దకొత్తపల్లి పోలీసుస్టేషన్‌లో నిర్మల ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే దామోదర్‌గౌడ్‌కు అదే గ్రామానికి చెందిన బుసిగారి వెంకటమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై గతంలో వారి కుటుంబీకులతో గొడవలు జరిగాయని, వారిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సింగోటం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలుతుందని మత్స్యకారులు చెప్పడంతో దాన్ని వెలికితీశారు. దామోదర్‌గౌడ్‌గా నిర్ధారించి తలకు గాయాలైనట్లు గుర్తించి పోస్టుమార్టానికి తరలించినట్లు తెలిపారు.
బంధువుల ఇంట్లో తలదాచుకొన్నారు
ఈ క్రమంలో మంగళవారం వెంకటమ్మ, కుటుంబీకులు పెద్దకొత్తపల్లిలో బంధువుల ఇంట్లో ఉన్నారన్నా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో 11వ తేదీ రాత్రి వెంకటమ్మ ఇంటికి దామోదర్‌గౌడ్ రాగా ఆమె భర్త బిచ్చయ్య, కుమారుడు కుర్మయ్యకు మధ్య వాగ్వాదం జరగడంతో కర్రలతో దాడిచేసి కొట్టి చంపినట్లు తెలిపారని పేర్కొన్నారు. అదేరోజు అర్ధరాత్రి ట్రాక్టర్ డ్రమ్ము స్టాండ్‌పై దామోదర్‌గౌడ్ మృతదేహం, అతని బైక్‌ను కుడికిళ్ల సమీపంలోని కేఎల్‌ఐ కాల్వలో పడేయగా మృతదేహం కాల్వగుండా కొట్టుకొచ్చి సింగోటం చెరువులో తేలినట్లు తెలిపారు. హత్యకు వెంకటమ్మ బంధువు పెబ్బేటి వెంకటస్వామి కూడా సహకరించినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు డీఎస్పీ వెల్లడించారు. మృతదేహం తరలించిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో కొల్లాపూర్ సీఐ మహేష్, పెద్దకొత్తపల్లి ఎస్‌ఐ సతీష్ ఉన్నారు.
హత్య చేసింది ప్రియురాలి కుటుంబీకులే..
నిందితులను అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్