
‘కవిత్వమే చిరస్థాయిగా నిలుస్తుంది’
కందనూలు: ప్రజా కవిత్వమే ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో కవి సంగమం వ్యవస్థాపకుడు యాకుబ్ సభాధ్యక్షతన ఎదిరేపల్లి కాశన్న రచించిన ‘రేపటి కాలం’ కవిత్వాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. సమకాలీన సమాజపు అలజడులకు చలించి గుండె లోతుల్లోంచి పద్యమై పలుకుతుందన్నారు. సమాజంలోని పలు సంఘటనలను కవిత్వం అసమానతలు, దోపిడీ, అధర్మం ధిక్కారంగా వినిపించారని కొనియాడారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ ఈ కవిత్వంలో వర్గీకరణ ఉద్యమం తుది దశకు చేరుకున్న చారిత్రక సందర్భం, పాటకు ప్రతిబింబమైన గద్దర్ జీవితం, సావిత్రిబాయి పూలే, సమ్మక్క, సారక్కలపై కవిత్వం వినిపించారని, సామాజిక, రాజకీయ దృక్పథం కవిత్వం నిండా పరుచుకుందన్నారు. సమాజంలో పాలకుల దోపిడీ విధానాలను కవిత్వంలో ఎజెండా చేయడం ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన కాశన్న ఉద్యమం తోవను విడవకుండా ప్రజల సమస్యలపై కవిత్వం రాశారన్నారు. కార్యక్రమంలో తగుళ్ల గోపాల్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సామిడి జగన్‌రెడ్డి, చింతలపల్లి భాస్కరరావు, నాగవరం బాల్‌రాం, వనపట్ల సుబ్బయ్య, కందికొండ మోహన్, రమేష్‌బాబు, మద్దిలేటి, గుడిపల్లి నిరంజన్, ముచ్చర్ల దినకర్ తదితరులు పాల్గొన్నారు.