
చిరుత కోసం ముమ్మర గాలింపు
● మరో బోను ఏర్పాటు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లా కేంద్రానికి సమీపంలోని టీడీగుట్ట, వీరన్నపేట, గుర్రంగట్టు పరిసర ప్రాంతాల ప్రజలను చిరుత సంచారం భయబ్రాంతులకు గురిచేస్తోంది. చిరుతను పట్టుకునేందుకు పోలీసు, అటవీ శాఖలకు చెందిన బృందాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా దొరకకపోగా అప్పుడప్పుడూ రాళ్లపై కలియ తిరుగుతూ కనిపించడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి తెప్పించిన మరో బోనును టీడీగుట్ట ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అమర్పారు. చిరుతను ఎలాగైనా పట్టుకునేందుకు గా లింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
వ్యక్తి మృతిపై కేసు నమోదు
జడ్చర్ల: మండలంలోని ఉదండాపూర్ శివారులో హెచ్‌ఈసీ కంపెనీలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న యూపీకి చెందిన రాజకుమార్(47) శుక్రవారం రాత్రి ఆకస్తాత్తుగా కూర్చున్నచోటే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే జడ్చర్ల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి సోదరుడు రాకేష్‌కుమార్ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.