మహబూబాబాద్ రూరల్: గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండల సమన్వయ సమీక్ష సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మండల సమన్వయ సమీక్ష సమావేశానికి 14 మంది సర్పంచులు హాజరుకాకపోవడం విచారకరమన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంలేదని, విద్యుత్ సరఫరాలో, విద్యుత్ సమస్యల పరిష్కారంలో అవాంతరాలు తలెత్తుతున్నాయని సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే రూ.46లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
సర్పంచులకు షీటీం అవగాహన
సమన్వయ సమావేశంలో షీటీం ఎస్సై సునంద ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రతపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మహిళలు, బాలికల భద్రతకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఇందిరమ్మ ఇల్లున్న గ్రామాల్లోనే ఓట్లు అడుగుతాం
నెల్లికుదురు: ఇందిరమ్మ ఇళ్లులు ఉన్న గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని, బీఆర్‌ఎస్ నాయకులు కూడా తమ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్లులు ఇచ్చిన గ్రామాల్లోనే ఓట్లు అడుగాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మండలంలోని మధనతుర్తి గ్రామంలో పోషణ మాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి వెంకన్న, తహసీల్దార్ చంద నరేష్, ఎంపీడీఓ సింగారపు కుమార్, మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవరెడ్డి, సీడీపీఓ రేష్మ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్


