విద్యార్థులకు టీషర్ట్స్ పంపిణీ
బయ్యారం: మండలంలోని గురిమెళ్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం టీ షర్ట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ నిర్వాహకుడు రామసహాయం శ్రీధర్‌రెడ్డి, హెచ్‌ఎం ఉపేందర్‌రెడ్డి, సొసైటీ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, సభ్యులు శ్రీదేవి, నవీన్ పాల్గొన్నారు.
భూముల రీసర్వే ప్రారంభం
డోర్నకల్: మండలంలోని బూరుగుపాడు గ్రామంలో శనివారం రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో భూముల రీసర్వే ప్రారంభమైంది. భూముల రీసర్వే సమయంలో సంబంధిత రైతులు అందుబాటులో ఉండాలని తహసీల్దార్ రాఘవరెడ్డి కోరారు. కాగా గుర్రాలకుంట గ్రామపంచాయతీలో భూముల రీసర్వే పూర్తి చేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు మృతి
దంతాలపల్లి: మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఈదురు జనార్దన్(45) రాష్ట్ర సాధన కోసం తన వంతు కృషి చేశాడు. జనార్దన్ కొన్ని సంవత్సరాల క్రితం ఖమ్మం వెళ్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి..
తొర్రూరు: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎర్రసోమ్లా తండా శివారులో శనివారం రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న సుమారు 55 ఏళ్ల వయసున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
వీబీ జీ రామ్ జీ పనులపై అవగాహన
ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మాషన్’ పనులపై ప్రత్యేక అవగాహన సదస్సును ఇన్‌చార్జ్ ఎంపీడీఓ బండారు పార్ధసారథి అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిథిగా దిశ కమిటీ సభ్యుడు గుజ్జునూరి బాబురావు, ఏపీఓ దీప్లా హాజరయ్యారు. సదస్సులో‘వీబీజీ రామ్ జీ పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరుపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
నెహ్రూసెంటర్: విద్యుత్ 11కేవీ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు పట్టణంలోని పాత బజార్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్‌శాఖ ఏఈ సంగీత శనివారం తెలిపారు.
ఇన్‌చార్జ్ ఎంపీఓకు సన్మానం
మరిపెడ రూరల్: నేతావత్ పర్కజలతండా గ్రామ పంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభకు హాజరైన నూతన ఇన్‌చార్జ్ ఎంపీఓ శ్రీనివాస్‌ను సర్పంచ్ బానోతు కొండయ్య, అంగన్‌వాడీ టీచర్ బానోతు కవిత సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
పాలాభిషేకం
కురవి: మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఫ్లెక్సీకి దళిత సంఘాల నాయకులు శనివారం పాలాభిషేకం చేశారు. కురవిలో ఎస్సీ బాలికల హాస్టల్‌ను వేరే భవనంలోకి మార్చేందుకు కృషి చేసినందుకు పాలాభిషేకం చేసినట్లు దైదభద్రయ్య, కిన్నెర మల్లయ్య, ఇరుగు వెంకన్న తెలిపారు.
కొనసాగుతున్న ఉద్యోగుల నిరసన
దంతాలపల్లి: మండల వైద్యశాల ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో నిరసన శనివారం కొనసాగింది. వైద్యులు చందు, వాణి, ఎన్‌ఎంలు స్వప్న, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
తొర్రూరు రూరల్: ప్రకృతి వ్యవసాయంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని సర్పంచ్ బానోతు శ్రీను కోరారు. శనివారం మండలంలోని జీకే తండాలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓ భరత్‌చంద్ర, ఇతర ప్రతినిధులు సుష్మా, రాజేశ్వరి, గిరి, యాకాంబ్రం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మహిళతో అసభ్య ప్రవర్తన
మరిపెడ రూరల్: ఒంటరిగా ఉన్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన ఓ వ్యక్తిని మరిపెడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై మైబూబీ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరారం గ్రామానికి చెందిన ఏర్పుల సురేష్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడిని శనివారం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
25గుంటలకే పరిహారం..
గార్ల: మండలంలోని పుల్లూరు పంచాయతీలో రైతు కీసర సీతారాంరెడ్డికి చెందిన 2.20ఎకరాల భూమి సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణంలో పోతుండగా, అధికారులు మాత్రం కేవలం 25గుంటల భూమికి మాత్రమే పరిహారం చెల్లిస్తామని పేర్కొనడం ఎంత వరకు సమంజసం అని బాధిత రైతు శనివారం విలేకరుల ఎదుట వాపోయాడు. సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ప్రాజెక్ట్ కింద కోల్పోతున్న 2.20ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే తన భూమిలో కాల్వ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని బాధిత రైతు డిమాండ్ చేశాడు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
దంతాలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై రవికుమార్ శనివారం తెలిపారు. మండలంలోని రామవరం గ్రామంలోని పాలేరువాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. మండలంలోని దుబ్బతండా జీపీ పరిధిలోని రేఖ్యాతండాకు చెందిన రెండు ట్రాక్టర్లు పట్టుబడినట్లు తెలిపారు. ట్రాక్టర్లను సీజ్ చేసి, ఓనర్లు, డ్రైవర్లపై కేసు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
గుండెపోటుతో నాయకుడి మృతి
మరిపెడ: పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పాల్వాయి భాస్కర్ (45) గుండెపోటుకు గురై శనివారం మృతి చెందాడు. భాస్కర్ మృతి పార్టీకి తీరనిలోటని పార్టీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు.


