బచ్చన్నపేట : తెలంగాణ ఆపిల్స్‌గా పిలువబడే సీతాఫలాలకు కేరాఫ్‌గా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని మన్‌సాన్‌పల్లి గ్రామం నిలిచింది. ఇక్కడ దాదాపు 430 ఎకరాల ఫారెస్ట్ భూమిలో పలు రకాల పండ్ల మొక్కలతో పాటు ఎక్కువ శాతంలో సీతాఫలాల చెట్లు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ సీతాఫలాలను కోసుకోవడానికి ప్రతి ఏటా వేలం నిర్వహించే వారు. ఒక్కో ఏడాది దాదాపు రూ.5 నుంచి రూ.6లక్షల వరకు వేలం పాట జరుగుతుంది. కోతుల బెడదతో వేలం పాడిన వ్యక్తులకు గిట్టుబాటు కావడం లేదని తక్కువకు వేలం పాడుతున్నారు. ప్రస్తుతం రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షలు మాత్రమే ధర పలుకుతుంది. ఈ చెట్లను కాపాడడానికి కోతుల నుంచి రక్షించుకోవడానికి వేలం పాటదారులు బాధ్యతను తీసుకుంటారు. ఈ సీతాఫలాలను కోయడానికి, డబ్బాల్లో ప్యాక్ చేసి మార్కెట్‌కు తరలించడానికి ఆటోలు, డీసీఎంలకు కూడా జీవనోపాధి కలుగుతుంది.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
మన్‌సాన్‌పల్లి గ్రామంలో పండించిన సీతాఫలాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మిర్యాలగూడ, ఖమ్మం, హైదరాబాద్, కోదాడ, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి, విజయనగరం, గుంటూరు పట్టణాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి ఈ సీతాఫలాలను కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకెళ్తారు. విజయవాడకు ఎక్కువ మొత్తంలో కాయలను ఎగుమతి చేస్తారు. మార్కెట్‌లో ఒక్కో పెట్టే రూ.800 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తారు. ఒక్కో పెట్టేలో కాయల సైజును బట్టి 80 నుంచి 100 కాయల వరకు ఉంటాయి.
ఆదాయం.. జీవనోపాధి
సీతాఫలాల తోటలో కాయలు తినకుండా కోతుల కాపలాకు దాదాపు 10 మంది వరకు పనిచేస్తుంటారు. కాయలు తెంపి లోడింగ్ చేయడానికి రోజు 30 మంది కూలీలు పని చేయాల్సి ఉంటుంది. వానాకాలంలో ఏ పని లేని సమయంలో ఇక్కడ జీవనోపాధి దొరుకుతుంది. అధికారులు చొరవ తీసుకొని కోతుల నివారణ చర్యలను చేపడితే మరింత సీతాఫలాలు వస్తాయని గ్రామస్తులు అంటున్నారు. జనగామ అటవీ శాఖ రేంజ్ అధికారి భాస్కర్ మాట్లాడుతూ.. ఏటా సీతాఫలాల వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో సగం ఆదాయాన్ని గ్రామాభివృద్ధికే వినియోగిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం వన సంరక్షణ సమితి ఖాతాలో రూ.12 లక్షల వరకు ఉన్నాయని తెలిపారు.
430 ఎకరాల్లో సీతాఫలాల చెట్లు
ఇతర రాష్ట్రాలకు పండ్ల ఎగుమతి
ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వాహణ


