వేలేరు: వ్యాపార భాగస్వామి వేధింపులతో హనుమకొండ జిల్లా వేలేరు మండలం గొల్లకిష్టంపల్లి గ్రామానికి చెందిన ఏదునూరి నరేశ్(29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడు ఎల్.సురేశ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నరేశ్, సురేశ్ సుమారు 7 నెలల క్రితం డీజే సౌండ్స్, లైటింగ్, డెకరేషన్ వ్యాపారం ప్రారంభించారు. అయితే మూడు నెలల నుంచి వ్యాపారంలో లాభనష్టాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఈనెల 9న సురేశ్ కొంతమందితో కలిసి నరేశ్ ఇంటికి వెళ్లి భార్యాపిల్లల ఎదుట చంపుతానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన నరేశ్ 16వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ 20వ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సురేశ్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


