
నైపుణ్యంతోనే ప్రజలకు న్యాయం
మామునూరు: పోలీస్ అధికారులు విధుల్లో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం లభిస్తుందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సీపీ సన్ ప్రీత్‌సింగ్ పర్యవేక్షణలో మూడు రోజులుగా నిర్వహించిన తెలంగాణ పోలీస్ 2వ డ్యూటీ మీట్–2025 శనివారం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు డీజీపీ జితేందర్, జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్యమిశ్రా ముఖ్యఅతిథులుగా హాజరై డ్యూటీ మీట్ విజేతలకు ట్రోఫీలు, షీల్డ్‌లు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అత్యధిక మెడల్స్ సాధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించగా డీజీపీ ట్రోఫీ అందజేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు సిబ్బంది ఇదే స్ఫూర్తితో రాబోయే జాతీయ స్థాయి డ్యూటీ మీట్‌కు సిద్ధం కావాలని, లక్ష్యం ఎంచుకుని కఠోర సాధన చేసి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించారు. పోలీస్ అధికారులు క్రమ శిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ రెండోసారి వరంగల్‌లో రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. తాను ఎస్పీగా ఉన్న సమయంలో నిర్వహించిన డ్యూటీ మీట్ గుర్తుకు వస్తోందని పేర్కొన్నారు.
పోటీల్లో అధికారుల సత్తా ..
రాష్ట్ర స్థాయి రెండో పోలీస్ డ్యూటీ మీట్–2025లో ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అందుకుంది. సైంటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్‌నెస్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు జరగగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 4 ట్రోఫీలు, 17 పతకాలు కై వసం చేసుకుంది. ఇందులో 6 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్, 4 బ్రాంజ్ (కాంస్య) మెడల్స్ ఉన్నాయి. సైంటిఫిక్ ఎయిడ్ టు ఇన్విస్టిగేషన్ పోటీల్లో సైబరాబాద్ కమిషనరేట్ ప్రథమ స్థానం, హైదరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం, భద్రాచలం జోన్ తృతీయ స్థానం, యాంటీ సబటేజ్ చెక్‌లో ఇంటెలిజెన్స్ ప్రథమ స్థానం, సైబరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం, డాగ్ స్క్వాడ్ కాంపీటిషన్‌లో సీఐడీ హైదరాబాద్ ప్రథమ స్థానం, ఇంటెలిజెన్స్ (ఐఎస్‌డబ్ల్యూ) ద్వితీయ స్థానం, బెస్ట్ డాగ్‌లో కాళేశ్వరం జోన్ ప్రథమ స్థానం, కంప్యూటర్ అవేర్‌నెస్, ఫొటోగఫీ పోటీల్లో ఐటీ అండ్ సీ హైదరాబాద్ ప్రథమ స్థానం, ఇంటెలిజెన్స్ హైదరాబాద్ ద్వితీయ స్థానం, వీడియో గ్రఫీ పోటీల్లో సైబరాబాద్ కమిషనరేట్ ప్రథమ స్థానం, హైదరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం సాధించి పతకాలు అందుకున్నాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐడీ డీఐజీ నారాయణనాయక్, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీశ్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబూబాద్ జిల్లా ఎస్పీలు కిరణ్ ఖరే, సుధీర్ రామ్‌నాథ్ కేకన్, పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ, టీజీ ఎన్పీడీజీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, బల్దియా కమిషనర్‌చాహత్ బాజ్‌పాయ్, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
కఠోర సాధనతోనే విజయాలు
డీజీపీ డాక్టర్ జితేందర్
ముగిసిన రాష్ట్ర స్థాయి
2వ పోలీస్ డ్యూటీమీట్–2025
అతిఽఽథులకు గౌరవ వందనం ..
రాష్ట్ర స్థాయి 2వ పోలీస్ డ్యూటీ మీట్–2025 ముగింపు వేడుకల్లో 450 మంది అధికారులు, సిబ్బంది జెండాలు చేతబూని డీజీపీ జితేందర్‌రెడ్డి, జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రాకు గౌరవ వందనం సమర్పించారు.

నైపుణ్యంతోనే ప్రజలకు న్యాయం

నైపుణ్యంతోనే ప్రజలకు న్యాయం

నైపుణ్యంతోనే ప్రజలకు న్యాయం