
భగ్గుమన్న భూ తగాదాలు..
పాలకుర్తి టౌన్ : మూడు ఇంచుల స్లాబ్ ఇంటి నిర్మాణం వద్ద మొదలైన మాటలు ఘర్షణకు దారి తీశాయి. దాయాదులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు సుతారి తండాలో జరిగిన భూ దగాదాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. బాధితుల కథనం ప్రకారం.. తండాకు చెందిన వాంకుడోతు సక్రు, రంగమ్మ దంపతులు తమ ఇంటి నిర్మాణం కొనసాగిస్తుండగా అదే తండాకు చెందిన దాయాదులు బాలు, రామోజీ, శ్రీకాంత్, సంతోష్, యాకు, భాస్కర్ కర్రలు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దంపతులతో సహా తమ ఐదుగురు కుమార్తెలు, వారి పిల్లలు మొత్తం పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు స్పందించపోవడంతో బాధితులు అదే రోజు రాత్రి పాలకుర్తి సీఐ కార్యాలయానికి వచ్చారు. అయితే సీఐ అందుబాటులో లేకపోవడంతో పాలకుర్తి ఎస్సై పవన్‌కుమార్.. కొడకండ్ల ఎస్సై రాజుతో మాట్లాడి పంపించారు. కాగా, కొడకండ్ల ఎస్సై రాజు తమను పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించారని, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
మూడు ఇంచుల స్లాబ్ ఇంటి
నిర్మాణంలో ఘర్షణ
పరస్పర దాడులు.. పది మందికి
తీవ్రగాయాలు
సుతారి తండాలో ఘటన