
చిరంజీవులుగా జీవిద్దాం..
వెంకటాపురం(ఎం) : మనిషి మరణించిన తర్వాత మట్టిగానో.. బూడిదగానో మారే అవయవాలను దానం చేస్తే మరొకరికి ప్రాణం పోసినట్లే. అంతేకాకుండా అవయవాలను దానం చేసిన మనిషి కూడా చిరంజీవిగా జీవించినట్లే. చావుకు సమీపంలో ఉన్న వ్యక్తిని బతికించగల గొప్ప కార్యమిది. ఈ క్రమంలో అవయదానంపై సమాజంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. అవయవదానం కొత్తేమీ కాదు. కన్నప్ప సాక్షాత్తు ఈశ్వరుడికే తన కన్ను దానం చేశాడు. మన మధ్య కూడా అలాంటి దానకర్ణులు ఉన్నారు. విలువైన అవయవాలను మట్టిపాలు చేసే బదులు ఇంకొకరికి దానం చేస్తే వారి ఆయుష్షు పెంచిన వారమవుతామని వైద్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయువు పోయినా.. అవయదానంతో ఊపిరిపోద్దాం.. రండి.. అవయదానం చేద్దాం.. మరణించినా మరో వ్యక్తిలో జీవించే ఉందాం.. అంటూ అవయవాల దానంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ఏటా ఆగష్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
చనిపోయిన తర్వాత దానం చేసే అవయవాలు..
మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయొచ్చు. అయితే రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తలకు రక్త సరఫరా నిలిచిపోయిన, తీవ్రంగా గాయపడిన వారు బ్రెయిన్ డెడ్ అని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే అవయవాలను సేకరిస్తారు.
ఎనిమిది మందికి పునర్జన్మ..
చనిపోయిన వ్యక్తి నుంచి ఎనిమిది మందికి అవయవాలను దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, కళ్లు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, ఎముకల్లోని మజ్జ, ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, కాలేయం, ఎముక మజ్జ బతికుండగానే దానం చేయొచ్చని పేర్కొంటున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
తెలంగాణ నేత్ర శరీర అవయవదానం సంస్థ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 228 మంది నుంచి కళ్లు, 158 పార్థివదేహాలు, 126 మంది నుంచి అవయవాలు సేకరించారు. 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా నిర్వాహకులు ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన ఈ సంస్థ దేశంలోనే ఆర్గాన్ డోనేషన్‌లో రెండో స్థానంలో ఉంది.
మరణిస్తూ మరొకరికి ప్రాణంపోద్దాం..
అవయవదానంపై సమాజంలో
పెరుగుతున్న అవగాహన
నేడు జాతీయ అవయవదాన దినోత్సవం

చిరంజీవులుగా జీవిద్దాం..