
కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
మహబూబాబాద్ రూరల్: పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో కేసులను మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. సెప్టెంబర్‌లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో పెండింగ్ కేసుల పరిష్కారంపై జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ.. 90 రోజుల మీడియేషన్ కార్యక్రమం ద్వారా పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలంటే జైల్లోని ఖైదీలను కోర్టులో సకాలంలో హాజరుపర్చాలని సూచించారు. పెండింగ్ వారెంట్లు త్వరగా క్లియర్ చేయాలని, సాక్ష్యులను సరైన సమయంలో హాజరుపర్చాలన్నారు. విచారణ అధికారులు తమ విచారణల్ని త్వరగా ముగించి కోర్టుకు సహకరించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పెద్ద మొత్తంలో కేసులు పరిష్కరించాలని ఆదేశించిన మేరకు 90 రోజుల మీడియేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్లలోకానీ, కోర్టుల్లోకానీ కేసులను మీడియేషన్ల ద్వారా పరిష్కరించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిందన్నారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్‌కుమార్, అదనపు కలెక్టర్ అనిల్‌కుకుమార్, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహ్మద్ అబ్దుల్ రఫీ
మీడియేషన్ ద్వారా కేసుల పరిష్కారం