
ఆడపిల్లల్లో స్నేహితుడిని చూసుకుంటూ..
కేసముద్రం: బాల్యమిత్రుడు మృతి చెందాడు. అతని ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. ఆ ఆడబిడ్డల్లో స్నేహితుడిని చూసుకుంటున్నారు కేసముద్రంలోని ఎస్‌వీవీ హైస్కూల్‌కు చెందిన 1996–97 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గాండ్ల అశోక్‌కు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్యకు కూతురు పుట్టగానే ఆమె మృతిచెందింది. ఆతర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. రెండో భార్యకు మరో కూతురు జన్మించగానే అశోక్ చనిపోయాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించిన ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆ ఇద్దరు ఆడపిల్లల పేరుమీద సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. ఏటా రూ.45వేల ఫీజు చెల్లిస్తూ పెద్దకూతురు శివానిని(6వ తరగతి) నర్సంపేటలోని ఓప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారి చదువుకున్నంత కాలం ఆ తాము చదివిస్తామని బాల్యమిత్రులు చెబుతున్నారు.