
రైల్వేస్టేషన్లలో మెరుగైన వసతులు
● డీఆర్‌ఎం గోపాలకృష్ణన్
మహబూబాబాద్ రూరల్ : ప్రయాణికుల అవసరాల మేరకు రైల్వే స్టేషన్లలో మెరుగైన వసతులు కల్పిస్తామని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న డీఆర్‌ఎం.. నిర్మాణ పనులు పరిశీలించి గడువులోగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
డీఆర్‌ఎంను కలిసిన ఎమ్మెల్యే..
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కొత్త బజారు వైపున నాలుగో ప్లాట్ ఫామ్ నిర్మించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్.. డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌ను కోరారు. అలాగే, రైల్వే స్టేషన్‌లో మౌలిక వసతులు కల్పించాలని, రైల్వే మెయింటెనెన్స్ వర్క్ షాపుతో పాటు గ్రాండ్ ట్రంక్, ఏపీ, తమిళనాడు, వందేభారత్, ఎల్‌టీటీ, గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని, అండర్ పాస్ నిర్మించాలని కోరారు. అలాగే, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఇందుభారతి, ఇస్లాహే మాషిరా అధ్యక్షుడు ఎక్బాల్ కూడా డీఆర్‌ఎంను కలిసి మానుకోట రైల్వే స్టేషన్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.
రైల్వే స్టేషన్ తనిఖీ..
డోర్నకల్: డోర్నకల్ రైల్వేస్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. ప్రత్యేక రైలులో డోర్నకల్ చేరుకున్న డీఆర్‌ఎం రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లను తనిఖీ చేశారు. అనంతరం గూడ్స్ యార్డులోని సీ అండ్ డబ్ల్యూ డిపోను తనిఖీ చేశారు. డీఆర్‌యూసీసీ సభ్యులు ఖాదర్, వర్తక సంఘం ప్రముఖులు కాలా మహేందర్‌జైన్ తదితరులు రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు డోర్నకల్‌లో హాల్ట్ కల్పించాలని కోరుతూ డీఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశారు.