
వైద్యం కోసం వచ్చి అనంతలోకాలకు..
జనగామ: వ్యవసాయ పొలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ రైతు వైద్యం కోసం వచ్చి ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసంతాపురం గ్రామానికి చెందిన రైతు ఎం.ప్రభాకర్‌రెడ్డి(47) గత నెల 26వ తేదీన వ్యవసాయ పొలం దున్నుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగ తెగిపడడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో ట్రాక్టర్ కేజ్‌వీల్స్ అతడి రెండు కాళ్లపై వెళ్లడంతో వెంటనే జనగామలోని ‘అజంతా’ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ బాలాజీ పరీక్షించి.. ప్రభాకర్‌రెడ్డి కాలుకు ఇన్‌ఫెక్షన్ ఉందని, తగ్గే వరకు సర్జరీ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బుధవారం ఇంటికి తీసుకెళ్లాలని చెప్పగా పరిస్థితి విషమంగా ఉంటే ఎలా తీసుకెళ్లాలని కుటుంబీకులు సదరు వైద్యుడిని నిలదీయగా ఆస్పత్రిలోనే ఉండమన్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ప్రభాకర్‌రెడ్డి మృతిచెందాడు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రభాకర్‌రెడ్డి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. కాలు ఇన్‌ఫెక్షన్‌కు గురైతే మరో ఆస్పత్రికి రెఫర్ చేయకుండా, ఐదు రోజులుగా ఆ ఆస్పత్రిలోనే ఉంచుకోవడంతోనే పరిస్థితి విషమించి ప్రభాకర్ రెడ్డి మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఈ ఘటనపై డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ పేషెంట్‌కు షుగర్, వీడీఆర్‌ఎల్ పాజిటివ్, ఇన్‌ఫెక్షన్, మోకాళ్ల వాపులు ఉండడంతో తగ్గే వరకు సర్జరీని వాయిదా వేసినట్లు చెప్పారు. అంతలోనే గుండెపోటుతో మృతి చెందాడని, ఇందులో తమ తప్పులేదని తెలిపారు.
ఆస్పత్రిలో రైతు మృతి
డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ
బాధితుల ఆందోళన
జనగామ జిల్లా కేంద్రంలో ఘటన