
నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలి
● సీఐడీకి తెలంగాణ క్రికెట్ సంఘం ఫిర్యాదు
వరంగల్ స్పోర్ట్స్ : బీసీసీఐ నుంచి హెచ్‌సీఏ ద్వారా ఆయా జిల్లాలకు విడుదలయ్యే నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యదర్శి తాళ్లపెల్లి జయపాల్ గురువారం సైబరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పది సంవత్సరాలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుతో రాష్ట్రంలోని జిల్లా సంఘాల ఖాతాల్లో రూ. 12 కోట్లు జమ చేశారని పేర్కొన్నారు. అందులో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీఐడీ అధికారులను కోరారు.
హత్యాయత్నం కేసులో వ్యక్తికి ఐదేళ్ల జైలు, జరిమానా
దంతాలపల్లి: హత్యాయత్నం కేసులో నేరస్తుడికి ఐదేళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు గురువారం తీర్పువెలు వరించింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఏరుకొండ నరేశ్ అదే గ్రామానికి చెందిన పోలోజు సునీతపై 2023 సంవత్సరంలో కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సునీత కుమారుడు యాకాంబ్రం ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై జగదీశ్ కేసు నమోదు చేసి మహబూబాబాద్ జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాదోపవాదల అనంతరం నేరం రుజువు కావడంతో నేరస్తుడు నరేశ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10వేలు జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి షాలిని షాకెల్లి తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన పీపీ గణేశ్ ఆనంద్, ఎస్సై జగదీశ్, ఎస్సై రాజు, కోర్టు కానిస్టేబుల్ మంగీలాల్‌ను ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్ కేకన్ అభినందించారు.