
ట్రైనీ సర్వేయర్లకు న్యాయం చేయాలి
హన్మకొండ అర్బన్: ట్రైనీ లైసెన్స్‌డ్ సర్వేయర్ సిస్టమ్ (ఎల్‌ఎస్‌ఎస్)కు ఇటీవల నిర్వహించిన పరీక్షలో సమయానికి మించి ప్రశ్నాపత్రం ఉండడంతో తమకు అన్యాయం జరిగిందని ట్రైనీ ఎల్‌ఎస్‌ఎస్‌లు వాపోయారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థియరీ ప్రశ్నాపత్రంలో ఇంగ్లిష్, తెలుగులో విభిన్నంగా ప్రశ్నలు రావడం, ప్రశ్నాపత్రాల్లో టోపో డిటెయిల్స్‌లో జరిగిన తప్పుల కారణంగా థియరీ ప్రశ్నాపత్రంలో సమాధానాలు రాయడానికి సమయం సరిపోలేదని పేర్కొన్నారు. తాలిమ్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్) మెటీరియల్ ప్రకారం 100 శాతం థియరీ – ప్రాక్టికల్స్‌ను జిల్లా శిక్షణ కేంద్రంలో అధికారులు, అధ్యాపకులు నేర్పించారని, అయినప్పటికీ ప్రశ్నలు మెటీరియల్ నుంచి ఇవ్వకుండా అన్యాయం చేశారని వాపోయారు. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, జవాబు పత్రాలలో పేజీలను పెంచాలని, ప్లాటింగ్‌లో ప్రింటింగ్ క్లారిటీగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.