వనాలపై పట్టింపేది?
మహబూబాబాద్: ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్స్ పరిరక్షణలో భాగంగా వాటిని ఏర్పాటు చేశారు. నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మొక్కలు ఎండిపోతున్నాయి.
51 పట్టణ ప్రకృతి వనాలు..
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు, 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి. ఉద్యోగ, విద్య, వ్యాపార రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపితే జనాభా లక్ష దాటుతుంది. 2020 నుంచి 2023 వరకు 51పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 1,46,626 మొక్కలు నాటారు. 10 ప్రకృతి వనాలకు ప్రహరీల నిర్మాణం చేపట్టగా, మిగిలిన 41 వనాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. విస్తీర్ణం ఆధారంగా పలు చోట్ల సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. కొన్ని వనాల్లో వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. అలాగే చెట్లకు నీరు అందించేందకు నాలుగు ట్యాంకర్లు కూడా కొనుగోలు చేశారు.
20మందితో గ్రీన్ టీం..
పట్టణ ప్రకృతి వనాల నిర్వహణ కోసం 20మందితో గ్రీన్ టీం ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి నెలకు రూ.12,000 వేతనం ఇస్తున్నారు. అయితే సరిపడా సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. గ్రీన్ బడ్జెట్ సక్రమంగా విడుదల కాకపోవడంతో జనరల్ ఫండ్ నుంచి 10శాతం కేటాయించి సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారు. అయితే వారికి రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండటం, పలు కారణాల వల్ల వనాల నిర్వహణ అధ్వానంగా మారింది. అలాగే జిల్లా కేంద్రంలోని డివైడర్ల మధ్యలోని చెట్లకు నీటి సరఫరా బాధ్యత కూడా వారిపైనే ఉంది. దీంతో వారిపై పని భారం పెరిగి సరిగా నిర్వహణ బాధ్యతలు చేపట్టలేకపోతున్నారు.
ఎండిపోతున్న మొక్కలు..
ప్రస్తుత వేసవిలో నీటిసరఫరాలో జాప్యం జరుగుతోంది. సరిపడా నీరు లేకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. వాకింగ్ ట్రాక్‌లు ఉన్నచోట వాకర్లు నిర్వహణపై దృష్టి పెడుతున్నారు.. అలాగే అధికారులకు తెలియజేస్తున్నారు. డివైడర్ల మధ్యలో నాటిన అలంకరణ మొక్కలకు మాత్రమే నీరు అందిస్తున్నారు. కాగా ట్యాంకర్ల ద్వారా ప్రకృతి వనా లకు నీటి సరఫరా చేయాలని, నిర్వహణపై అధి కారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, కూలిపోయిన ప్రహరీల స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాల ని, పాడైన బెంచీలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యేక దృష్టి పెట్టాం
పట్టణ ప్రకృతి వనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గ్రీన్ టీం సభ్యులు ప్రతీరోజు పనులు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. నిధులను బట్టి పనులు జరుగుతున్నాయి.
– గుజ్జు క్రాంతి, పర్యావరణ అధికారి
బడ్జెట్ కేటాయించాం
జనరల్ బడ్జెట్‌నుంచే 10శాతం నిధులు కేటాయించి గ్రీన్ టీం సభ్యులకు వేతనాలు ఇస్తున్నాం. పట్టణ ప్రకృతి వనాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నాం. రెండు నెలల వేతనాలు కూడా త్వరలో వారి ఖాతాల్లో జమ చేస్తాం. వనాలకు నీరు అందించేందుకే నాలుగు ట్యాంకర్లు కొనుగోలు చేశాం.
–నోముల రవీందర్, మున్సిపల్ కమిషనర్
నిర్వహణ లేక అధ్వానంగా
పట్టణ ప్రకృతి వనాలు
నీటి సరఫరా లేక ఎండిపోతున్న మొక్కలు
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో
51 వనాలు


