
స్టేజీపై ఆందోళన చేస్తున్న బాధితులు
మహబూబాబాద్ రూరల్ : మహర్ష డెవలపర్స్ లిమిటెడ్ గ్రూప్‌లో పాలసీలు చెల్లించిన వారికి ఎఫ్‌డీల గడువు ముగిసినా డబ్బులు చెల్లించడం లేదంటూ సంస్థ సీఈఓను ఏజెంట్లు, బాధితులు నిలదీసి ఆందోళన చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం ఆమనగల్లులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహర్ష డెవలపర్స్ లిమిటెడ్ గ్రూపు దశమ వార్షికోత్సవం ఆదివారం ఆమనగల్లులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కంపెనీ సీఈఓ గుడిబోయిన వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పాలసీలు, ఎఫ్‌డీల పేరుతో వసూలు చేసిన డబ్బులను గడువు ముగిసినా చెల్లించడం లేదంటూ సంస్థ నిర్వాహకులతో ఏజెంట్లు, బాధితులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా బాధితురాలు జయమ్మ, ఏజెంట్ స్వరూప మాట్లాడుతూ సంవత్సరం నుంచి వరంగల్‌లోని సంస్థ కార్యాలయం మూసి ఉంటుందని, ఫోన్ చేస్తే సమాధానం లేదన్నారు. గడువు ముగిసిన వారికి డబ్బులు ఇవ్వకుండా వెంచర్‌లో ప్లాట్లను బలవంతంగా అంట గడుతున్నారని వాపోయారు. ఈ సందర్భంగా మహర్ష గ్రూప్ డెవలపర్స్ లిమిటెడ్ సీఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.
మహర్ష డెవలపర్స్ ఏజెంట్లు,
బాధితుల ఆందోళన