● ఓర్వకల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన
కలెక్టర్, గోనెగండ్లలో జేసీ నూరుల్‌ఖమర్
● ఎమ్మిగనూరు, మంత్రాలయంలో
ఎస్‌పీ విక్రాంత్‌పాటిల్ పరిశీలన
● 170 గ్రామ పంచాయతీల్లో
80.53 శాతం పోలింగ్ నమోదు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆదివారం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద నువ్వా, నేనా అనే రీతిలో ఓట్లు వేసేందుకు ఉత్సాహాన్ని చూపారు. ఈ విడతలో మంత్రాలయం, ఎమ్మిగనూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలకు చెందిన 170 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. కాగా, 169 గ్రామ పంచాయతీల్లో సర్పంచు స్థానాలకు ఎన్నికలు జరగ్గా, నందవరం మండలం చిన్నకొత్తిలికి గ్రామ పంచాయతీలో సర్పంచు స్థానం ఏకగ్రీవం కాగా, వార్డులకు మాత్రం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు జరిగిన ఆయా గ్రామ పంచాయతీల్లో మొత్తం 80.53 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, అత్యధికంగా కల్లూరు మండలంలో 86.12 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, కోసిగి మండలంలో తక్కువగా 75.26 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సగటున ప్రతి మండలంలో 75 శాతానికి పైగానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. వలసలకు ఆలవాలమైన పడమటి పల్లెల ఓటర్లు సుదూర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు గ్రామాలకు రావడం వల్ల అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది.
గంట గంటకు పెరిగిన పోలింగ్ శాతం
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగాల్సి ఉంది. అయితే పలు పోలింగ్ కేంద్రాలకు మధ్యాహ్నం 1 గంటలోపు చేరుకున్న ఓట్లర్లకు అవకాశం కల్పించిన నేపథ్యంలో 2 గంటలు దాటేంతవరకు కూడా పోలింగ్ కొనసాగినట్లు తెలుస్తోంది. మొత్తం ఓటర్లు 4,36,939 కాగా.. ఓటింగ్‌లో 3,51882 మంది పాల్గొన్నారు.
పలు పోలింగ్ కేంద్రాలను
పరిశీలించిన కలెక్టర్, జేసీ, ఎస్పీ
2వ విడత పోలింగ్ జరుగుతున్న పలు గ్రామ పంచాయతీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జేసీ నూరుల్‌ఖమర్, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఓర్వకల్ మండలంలోని ఓర్వకల్, నన్నూరు, హుసేనాపురం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్‌ఖమర్ మండల కేంద్రమైన గోనెగండ్లలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల, మంత్రాలయంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఉదయం 9 గంటలకు: 27.17 శాతం
ఉదయం 11 గంటలకు 61.37 శాతం
మధ్యాహ్నం 1 గంటకు: 80.53 శాతం


