మేం ఇప్పటి వరకు 8 ఎకరాల్లో కందులు, 3 ఎకరాల్లో పసుపు, రెండు ఎకరాల్లో ఎర్ర మిరప సాగు చేశాం. మాకు నాలుగు బోర్లు ఉన్నాయి. గతంలో ఎపుడూ లేని విధంగా బోర్లలో నీరు అడుగంటి పోయింది. వర్షాలు లేక, బోర్లలో నీరు అడుగంటి పోవడంతో పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు ఎరువులు, విత్తనాలు, సేద్యాలు, బాడుగలు, కూలీ ఖర్చులు మొత్తంగా రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. పెట్టుబడి మొత్తం మట్టిపాలు అయినట్లే. వానల్లేక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.
– బత్తుల రాముడు, రామళ్లకోట, వెల్దుర్తి మండలం
జల్లులు మినహా ఒక మోస్తరు వర్షం కూడా లేదు. మాకు సొంత భూమి 2 ఎకరాలు ఉండగా... 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వర్షాధారం కింద రెండు ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో ఎర్ర మిరప సాగు చేశాం. జూలై నెలలో వర్షాలు పడి ఉంటే పంటలు కోలుకునే అవకాశం ఉంది. నెల రోజులుగా చినుకు జాడ లేకపోవడం, ఎండలు, గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇపుడు వర్షాలు పడినా కోలుకునే అవకాశం లేదు. ఇప్పటి వరకు రూ. లక్ష పెట్టుబడి పెట్టాం. ఎకరాకు రూ.12 వేలు కౌలు ఉంది. రెండు ఎకరాలకు రూ.24 వేలు చెల్లించాలి. గతంలో ఎపుడూ లేని విధంగా నష్టాలు మాట కట్టుకున్నాం. – ఎం.మల్లయ్య, హొళగుంద


