కోడుమూరు రూరల్: సచివాలయంలో పింఛన్ల పంపిణీ కోసం దాచిన డబ్బును కాజేసి చివరకు పోలీసులకు చిక్కిన సంఘటన శనివారం కోడుమూరులో చోటు చేసుకుంది. కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీలోని సచివాలయం–1లో ఆగస్టు 1న పింఛన్లు పంపిణీ చేసేందుకు వెల్ఫేర్ అసిస్టెంట్ అనీల్‌కుమార్ శుక్రవారం సాయంత్రం బ్యాంకు నుంచి పింఛన్ అమౌంట్ రూ.29.96 లక్షలు డ్రా చేశాడు. డ్రా చేసిన మొత్తంలో నుంచి పింఛన్ల పంపిణీ కోసం సిబ్బందికి రూ.16.56 లక్షలు ఇవ్వగా, మిగిలిన రూ.13.40 లక్షల నగదును సర్వేయర్, మహిళా పోలీస్, ఆఫీస్ బాయ్ సమక్షంలో గ్రామ సచివాలయంలోని బీరువాలో భద్రపరిచి తాళాలను అనీల్‌కుమార్ తీసుకెళ్లాడు. శనివారం ఉదయం పింఛన్ల పంపిణీ కోసం బీరువా తాళాలు తెరిచి చూడగా రూ.60 వేలు తక్కువగా ఉండటాన్ని గమనించి డబ్బుపోయిన విషయంపై సిబ్బందితో కలిసి కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామికి వెల్ఫేర్ అసిస్టెంట్ ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై ఎస్‌ఐ విచారణ చేపట్టగా ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న బోయ సురేష్ మారు తాళాలతో బీరువా నుంచి డబ్బులను దొంగలించినట్లుగా గుర్తించాడు. దీంతో బోయ సురేష్ నుంచి డబ్బులను ఎస్‌ఐ రికవరీ చేసి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌కు నగదును అప్పగించాడు. కాగా నగదు మాయమైన విషయాన్ని ఫిర్యాదు చేసిన వెంటనే చేధించి ఇంటి దొంగను పట్టుకున్న కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి, సిబ్బందిని గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు, ప్రజలు అభినందిస్తున్నారు.


