కర్నూలు(సెంట్రల్): టీచర్ ఎలిజబులిటీ టెస్టు(టీఈటీ)ను ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ...జిల్లాలో టెట్ కోసం 31,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి జిల్లాలో ఐదు, హైదరాబాద్‌లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి పంపుతామని, ఆలస్యంగా వస్తే అనుమతించబోరని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను తీసుకెళ్లరాదన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలతో గట్టి నిఘా ఉంచాలని డీఈఓ సుధాకర్‌ను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత
● ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు: రోడ్డు ప్రమాదాలను నివారించడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా నిరంతరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఈ ఏడాది జనవరి 1నుంచి జూలై 31వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి 24,846 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్‌స్టేషన్ల వారీగా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటు తెలిపారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం
కర్నూలు(అర్బన్): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9వ తేదీన అందరి సహకారంతో ఘనంగా నిర్వహిద్దామని జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి డీ సురేష్ అన్నారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన శనివారం తన చాంబర్‌లో గిరిజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఆయా సంఘాల నాయకులతో చర్చించారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు ఆర్ కై లాస్‌నాయక్, ఆర్ చంద్రప్ప, రామరాజు, వై రాజు, వై మద్దిలేటి, యోగేష్‌నాయక్, గుండాల నాయక్, సేవాలాల్‌నాయక్, సీమ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి రోజూ 35 వేల మందికి ఉపాధి పనులు కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): వ్యవసాయ పనులు తక్కువ ఉన్న నేపథ్యంలో జిల్లాలో ప్రతి రోజూ 35 వేల మందికి ఉపాధి పనులు కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం ఆమె వీబీజీరామ్‌జీ పథకం అమలుపై ఎంపీడీఓలు, ఏపీఓలు, ఇంజినీరింగ్ కన్సల్‌టెంట్లు, ఏపీడీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. హార్టికల్చర్ కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు ఐదు వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ కింద 11 రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో చేపడుతున్న ప్లాంటేషన్ కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. అనంతరం మండలాల వారీగా ఉపాధి పనుల కల్పన, ప్లాంటేషన్‌పై కలెక్టర్ సమీక్షించారు. టెలీకాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.


