● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి
కర్నూలు: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి కక్షిదారులను ప్రోత్సహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం మధ్యవర్తిత్వం 3.0పై న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి/న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథులుగా హాజరై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని హైకోర్టు తీర్మానించిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల నుంచి డిసెంబర్ 31 వరకు దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0పై ముమ్మర ప్రచారాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని కోర్టుల్లో నిర్వహిస్తామని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా ఏ విధంగా కేసులు పరిష్కారమవుతాయో న్యాయవాదులకు అవగాహన కల్పించారు. కక్షిదారులకు న్యాయవాదులు కూడా మీడియేషన్‌పై అవగాహన కల్పించి వారి కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని తెలిపారు. దీనివల్ల కోర్టుల్లో కేసులు విచారణ వరకు వెళ్లకుండానే పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం, ఖర్చు లేకుండా శాశ్విత పరిష్కారం కక్షిదారులకు లభిస్తుందని తెలిపారు. కర్నూలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


