రోళ్లపాడు గడ్డి మైదానంలో కృష్ణ జింకలు
ఎన్‌ఎస్‌టీఆర్‌లో అరుదైన గడ్డి మైదానాలు
ఆత్మకూరురూరల్: పర్యావరణమంటే భూమిపై ఉండే సమస్త భూ ఉపరితల ఆవరణమని తెలుసుకోవాలి. అడవులను సంరక్షించడం ఒక్కటే సమగ్ర పర్యావరణ రక్షణ కాదు. విశాలమైన పచ్చికబయళ్లు, పొద లు, గుల్మాలతో కూడిన గడ్డితో మైదానాలు కూడా. ఇవి పర్యావరణ సమతుల్యతకు విశేషంగా దోహద పడుతున్నావి. సాధారణ గడ్డి మైదానాలు జీవవైవిధ్యానికి ఇతోదికంగా ఉపయోగ పడుతున్నప్పటికీ వాటిని గ్రేజింగ్ (పశువులు మేసే బీళ్లు) గానో, బంజరులు గానో రెవెన్యూ రికార్డులు వర్గీకరిస్తున్నాయి కానీ వాటి సంరక్షణకు ఇప్పటికీ ప్రత్యేక చట్టాలు లేవు. నాగార్జునసాగర్ –శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న రోళ్లపాడు గడ్డి మైదానాలు క్షీణదశకు చేరుకుంటున్నా అటవీ అధికారులు ప్రమాదాన్ని గుర్తించలేక పోతున్నారు. బట్టమేకపక్షి సంరక్షణ కేంద్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో చోటు చేసుకున్న పెను మార్పులు గుర్తించక పోవడంతో ఈ మైదానం పర్యావరణ సమతుల్యతకు కృషి చేయలేక పోతోంది. రోళ్లపాడు అభయారణ్యంలో ఇప్పటికే బట్టమేక పక్షి జాడ కనిపించడం లేదు. గడ్డి మైదానాల్లో ఉండాల్సిన పొదలు, గుల్మాల వంటి వాటిని తొలగించడంతో ఇక్కడ ఉండాల్సిన ప్రధాన మాంసాహార జంతువు తోడేలు జీవనం ప్రమాదంలో పడుతోంది. పలు ప్యాక్ (గుంపు)లుగా ఉన్న తోడేళ్లు ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు.
క్షీణతకు కారణాలివే..
రోళ్లపాడు వంటి ప్రధాన గడ్డి మైదానాల ప్రాంతం ఒకప్పుడు మోకాటి ఎత్తు గడ్డిలో పలు రకాల కీటక జాతులకు ఆలవాలంగా ఉండేది. ఈ గడ్డి మైదానాల్లో కృష్ణ జింకల మందలు, గొర్ల మందలు తిరుగుతు మేస్తూ ఉంటే కీటకాలు పైకి లేస్తూ బట్టమేక, నేల నెమలి వంటి పక్షులకు పుష్కల ఆహారం అందించేవి. అందుకే అరుదైన బట్టమేక పక్షుల సంరక్షణ కేంద్రంగా దీన్ని అభయారణ్యంగా నోటిఫై చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ బట్టమేక పక్షి అసలు కనిపించడం లేదు. రోళ్లపాడు అభయారణ్యం చుట్టూ ఉన్న గ్రామ పరిధిలో ఒకప్పుడు కొర్రలు, ఆరికెలు వంటి తృణధాన్యాలు, అపరాల సాగు ఉండేది. అలాగే వేరుశనగ పంట కూడా ప్రముఖంగా పండేది. ఇది బట్టమేక పక్షికి ముఖ్య ఆహారం. అయితే ఈ పక్షి కేంద్రానికి ఆనుకుని అలగనూరు జలాశయం నిర్మించడం, శ్రీశైలం కుడిగట్టు కాలువలు రావడంతో వ్యవసాయ రీతి మారింది. వరి ప్రధాన పంటగా మారడంతో పాటు ఉద్యాన పంటలు పెరిగి అపరాలు, తృణధాన్యాలు మాయమయ్యాయి. మరో వైపు మరో వైపు అటవీ జీవావరణానికి ప్రమాద కరమైన ప్రోసోపిస్ (ముళ్ల పొదలు) జాతులు ఆక్రమణ కూడా జరుగుతోంది. ఈ జాతి మొక్కలు, గడ్డిని ఎదగకుండా చేస్తాయి. అంతే కాకుండా రోళ్లపాడు అనుబంధంగా ఉన్న ఎర్రమల చుట్టూ భారీ సోలార్ ప్రాజెక్ట్‌లు రావడంతో భూ స్వరూపమే పూర్తిగా మారింది. దీంతో రోళ్లపాడు అభయారణ్యం ఉనికిని కోల్పోతోంది.
భారత దేశపు గడ్డి మైదానాలు జీవావరణ ప్రాంతాలు. వీటిని రక్షించుకోవడానికి ప్రత్యేక చట్టాల ఆవశ్యకత ఉంది. 1986 పర్యావరణ రక్షణ చట్టం ఉన్నప్పటికీ దాని తీవ్రత సరిపోవడం లేదు. జాతీయ గడ్డి భూముల రక్షణపై ఏళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ సమగ్రమైన చట్ట పరిధి రక్షణ ఇప్పటికీ రూపొంద లేదు. ఇప్పటికై నా తగు చర్యలు తీసుకోక పోతే రోళ్లపాడు వంటి అద్భుతమైన గడ్డి మైదానాల్లో ఏషియన్ చీతా, బట్టమేక, తోడేలు వంటి అపురూప వన్యప్రాణుల పునఃప్రవేశాన్ని కలగనలేము.
– బి.విజయకుమార్ సీఎఫ్ డైరెక్టర్,
ఫారెస్ట్ అకాడమి, రాజమండ్రి
క్షీణదశలో రోళ్లపాడు గడ్డి మైదానాలు
కనిపించని బట్టమేక...
కనుమరుగవుతున్న తోడేళ్లు
పర్యావరణ సమతుల్యతకు
గడ్డి మైదానాలు కీలకం
ప్రమాదాన్ని గుర్తించని
అటవీ అధికారులు


