అనుమతి ఒకటి.. ప్రచారంలో మరొకటి! | - | Sakshi
Sakshi News home page

అనుమతి ఒకటి.. ప్రచారంలో మరొకటి!

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

నోటీసులు జారీ చేస్తాం

పత్తికొండలో ఒక స్కూల్‌ నిర్వాకం

మోసపోతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

పత్తికొండ: అనుమతి ఒక స్కూల్‌పైనే తీసుకుని ప్రచారంలో మరొక పాఠశాల పేరు చెబుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. పత్తికొండలో నడుస్తున్న ఈ స్కూల్‌పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆరేళ్ల కిందట పట్టణంలోని యశోదగార్డెన్‌ పాఠశాలను శ్రీచైతన్య విద్యా సంస్థల యాజమాన్యం లీజుకు తీసుకుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు న్యాయపరమైన అడ్డంకులు వచ్చాయి. దీంతో అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇదిలా ఉండగా శ్రీచైతన్య స్కూల్‌ పేరుతో ప్రచారం చేసుకోని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. యశోదగార్డెన్‌ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నారు.

ఫీజుల దోపిడీ!

శ్రీచైతన్య అలియాస్‌ యశోదగార్డెన్‌ స్కూల్‌లో ఇంటిగ్రేటిడ్‌ చదువు పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌, సీ బ్యాచ్‌, స్టేట్‌ సిలబస్‌ అంటూ మూడు భాగాలు చేసి ఫీజులు తీసుకుంటున్నారు. నర్సరీలో స్టడీ కోసం ఫీజు రూ.20వేలు ఉంది. పుస్తకాలు, యూనిఫామ్‌, స్టడీ మెటీరియల్‌ పేరుతో 35వేల రూపాయిలు ఉంటుంది. 6 నుండి 10 వరకు రూ.70వేలు దాకా ఉంటుంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఫీజులు ఇక్కడ వసూలు చేస్తూ గ్రామీణ విద్యార్థులపై పెనుభారం మోపుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా

యశోదగార్డెన్‌ స్కూల్‌ పేరుతో అనుమతి తీసుకుని శ్రీచైతన్య పేరుతో నడిచే పాఠశాలలో నిబంధనలకు విరుద్ధం వ్యవహరిస్తున్నారు. అధికారుల కళ్లకు గంతలు కట్టి చదువు పేరుతో ఫీజులు దోపిడీకి యాజమాన్యం పాల్పడుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల ఆవరణలో ఎక్కడా ఫీజులు సూచించే బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదులపై తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న అరోపణలు ఉన్నాయి.

యశోదగార్డెన్‌ స్కూల్‌ పేరుతో గుర్తింపు ఉండి శ్రీచైతన్య పేరుతో ప్రచారం చేసుకొని అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై పాఠశాల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనలను వివరిస్తాం. లేదంటే నోటీసులు జారీ చేసి చర్యలకు జిల్లా అధికారులుకు సిఫార్సు చేస్తాం. శ్రీచైతన్య పేరుతో వారు ఎలాంటి ప్రచారం చేసుకోవడానికి విద్యాశాఖ నుంచి అనుమతులు లేవు. – మాలతీ ఎంఈఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement