ఈ ఏడాది ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నా. మిరప, ఉల్లి సాగు చేయాలని పొలంలోనే నారు పోశా. మొక్కలు నాటుకొచ్చాయి కానీ అవసరమైన ఎరువులు లేవు. దీంతో నాటు వేయడం ఆపేశాను. రైతుకు ఇంట్లో ఎరువులు ఉంటేనే పంటలు సాగే చేసే ధైర్యం వస్తుంది. రైతుభరోసా కేంద్రాల దగ్గర సారోళ్ల అడిగితే ఎరువులు వస్తాయని చెప్పినారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ముఖ్యంగా యూరియా చాలా అవసరం.
– రామాంజనేయులు, రైతు, పత్తికొండ
చాలా ఏళ్లుగా పొలాలను కౌలు తీసుకుని పంటలను సాగు చేస్తున్నా. ఈ ఏడాది ఎరువులను తీసుకునేందుకు వీలుకుదరడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఎరువులు లేకుండా పంటలను ఎలా సాగు చేసుకోవాలి? ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకుని రైతులందరికీ అవసరమైన ఎరువులను అందజేయాలి.
– వెంకటేష్, కౌలు రైతు, సి.బెళగల్
పంటల సాగుకు సత్తువ ఎరువులు చాలా అవసరం. అలాంటి ఎరువులు ఏవీ అందుబాటులో లేవు. గత ప్రభుత్వంలో ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలోనే యూరియా, సత్తువ(డీఏపీ) ఎరువులు, పురుగు నివారణ మందులు అన్నీ ఆర్‌బీకేలో అందుబాటులో ఉండేవి. ఈ ప్రభుత్వ వచ్చాక ఆర్‌బీకేని ఆర్‌ఎస్‌కేగా పేరు మార్చారు తప్ప ప్రయోజనమేమీలేదు. ఇప్పుడు యూరియా తప్ప ఏవీ లేవు. ఎరువులు తెచ్చుకోవాలంటే డోన్‌కు 30 కిలోమీటర్లు, పత్తికొండకు 28 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. డోన్ నుంచి బస్తాకు ఆటో బాడుగ రూ.55. పత్తికొండ నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. ఆర్‌ఎస్‌కేల్లో విలువైన కియోస్క్ యంత్రాలు కూడా మూలనపడ్డాయి. ఏవీ పనిచేయడం లేదు.
– ఈశ్వరరెడ్డి, రైతు, బొందిమడుగుల


