2025 ఓటరు జాబితాలో వేలాది ఓటర్ల గల్లంతు
కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) గందరగోళంగా సాగుతోంది. 2025, 2002 ఓటరు జాబితాల్లో వేలాది మంది ఓటర్ల వివరాలు గల్లంతయ్యాయి. 2024 ఎన్నికల తరువాత జరిగిన స్పెషల్ సమ్మర్ రివిజన్‌లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల వివరాలను వ్యూహాత్మకంగా గల్లంతు చేశారు. దీంతో వారంతా బీఎల్‌ఓలను తమ ఓట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నిస్తున్నా సమాధానం కరువైంది. మరో వైపు 2002 జాబితాపై కూడా ప్రజల్లో ప్రతిష్టంబన నెలకొంది. కర్నూలు జిల్లాలో 2026 మార్చి 31వ తేదీ నాటికి 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది బతుకుదెరువు కోసం హైదరాబాద్, కడప, బెంగళూరు, ముంబయి, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలో 2025లో జరిగిన స్పెషల్ సమ్మర్ రివిజన్‌లో వారి ఓట్లపై వేటు వేశారు. ఆయా ఓటర్లకు కనీస సమాచారం ఇవ్వకుండానే తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 50వేలకు పైగా వలసదారులను జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్ సర్వేలో వారి ఓటు వివరాలు జాబితాలో లేకపోవడంతో ఖంగుతింటున్నారు. సర్వే పూర్తయిన తరువాత మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు కల్పిస్తామని అధికారులు చెబుతుండటం గమనార్హం.
2002 జాబితాపై అదే సస్పెన్స్
ప్రస్తుతం జరుగుతున్న సర్ సర్వేను 2002, 2025 ఓటరు జాబితాలతో పోల్చి చూస్తున్నారు. అయితే చాలా మంది ఓటర్ల వివరాలు 2002లో జాబితాలో లేవు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఇప్పుడున్న పలు ఓటర్లకు అప్పటిలో ఓటు హక్కు లేకపోవడం, 18 ఏళ్లు వచ్చినా ఓటు కోసం దరఖాస్తు చేసుకోకపోవడం తదితర కారణాలతో అప్పట్లో ఓటు హక్కు పొందలేకపోయారు. ఈ క్రమంలో వీరి తల్లిదండ్రులు, తాత, అవ్వల వివరాలను పోల్చి చూసి సర్ సర్వే చేయాలి. అయితే కొన్ని చోట్ల 2002 జాబితాకు సంబంధించిన ఐడీ కార్డు కావాలని అడుగుతున్నారు. అప్పటి కార్డులను ఓటర్లు ఎందుకు ఉంచుకుంటారని ప్రశ్నిస్తున్నా బీఎల్‌ఓలు పట్టించుకోని పరిస్థితి.
బీఎల్‌ఓలను భయపెడుతున్న టీడీపీ బీఎల్‌ఏలు
జిల్లాలో ఇప్పటి వరకు 20,56,119 మంది ఓటర్లలో 6,40,008 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫాంలను బీఎల్‌ఓలు అందజేశారు. దాదాపు 30.60 శాతం మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పాంలు అందాయి. అలాగే ఆన్‌లైన్ ద్వారా 7,660 మంది ఎన్యుమరేషన్ ఫాంలను సబ్‌మిట్ చేశారు. కాగా, ఆఫ్‌లైన్ ద్వారా బీఎల్‌ఓలు ఇవ్వాల్సిన ఎన్యుమరేషన్ ఫాంలను టీడీపీ బీఎల్‌ఏలు భయపెట్టి వారే నేరుగా ఓటర్లకు అందజేస్తున్నారు. ఈక్రమంలో బీఎల్‌ఓలు వారిని వారించడంలో భయపడుతున్నారు. టీడీపీ మరో మూడేళ్లు అధికారంలో ఉండనుండటంతో భవిష్యత్‌లో ఇబ్బందులకు గురి చేస్తారేమోనన్న భయంతో మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది.
మిత్రా యాప్‌లో నమోదు
సందడిలో సడేమియా అన్నట్లుగా టీడీపీ బీఎల్‌ఏలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. సర్ సర్వేను పరిశీలించే నెపంతో నేరుగా ఓటర్ల వివరాలను మిత్రా యాప్‌లో నమోదు చేస్తున్నారు. అయితే అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైంది. ఈ క్రమంలో మిత్రా యాప్ నుంచి నేరుగా ఫాం–7ను రైజ్ చేసి వైఎస్‌ఆర్‌సీపీ, ఇతర పార్టీల సానుభూతిపరుల ఓటర్లను తొలగించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్‌లో అన్ని పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు పాల్గొనవచ్చు. ఎక్కడైనా టీడీపీ బీఎల్‌ఏలు ఎన్యుమరేషన్ ఫాంలను ఇస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఓటర్ల వివరాలను ఎవరూ కాపీ చేయడానికి వీల్లేదు.
– డాక్టర్ ఏ.సిరి, జిల్లా ఎన్నికల అధికారి, కర్నూలు
వలసదారుల ఓటర్లను తొలగించిన వైనం
2002 జాబితాపై తొలగని ప్రతిష్టంబన
టీడీపీ బీఎల్‌ఏలే ఎన్యుమరేషన్
ఫాంల పంపిణీ
ఓటర్ల వివరాలు మిత్రా యాప్‌లో
నమోదు చేస్తున్న టీడీపీ బీఎల్‌ఏలు
ఇదేం పద్ధతి ‘సర్’
బీఎల్‌ఓలను నిలదీసిన వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏ
ఆదోని: ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి వివరాలు సేకరించాల్సిన బీఎల్‌ఓలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ‘ఇదేం పద్ధతి’ అని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏ అడ్డుకున్నారు. ఆదోని పట్టణంలోని 4, 34 వార్డుల్లో బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లకుండా సచివాలయంలోనే టీడీపీ బీఎల్‌ఏల సహాయంతో ఓటర్లను పిలిపించారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇళ్లకు వెళ్లకుండా సచివాలయాల్లో ఎందుకు కూర్చున్నారని వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు బి.దేవా నిలదీశారు. టీడీపీ బీఎల్‌ఏ జోక్యం చేసుకుంటూ తప్పేంటి అంటూ వాగ్వాదానికి దిగాడు. బీఎల్‌ఓలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లాల్సిందేనని బి.దేవా పట్టుబట్టాడు. ఎన్యుమరేషన్ ఇవ్వని వారికి చేటు తప్పదని, వారి ఓటు జూలై 21 ప్రచురించే ముసాయిదా జాబితాలో ఉండదని బి.దేవా హెచ్చరిస్తూ బీఎల్‌ఓలను సచివాలయం నుంచి ప్రజల మధ్యకు తీసుకెళ్లారు. బీఎల్‌ఓలు ఏదైనా పొరపాటు చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాఖపరమైన చర్యలు ఉంటాయని బి.దేవా హెచ్చరించారు. ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి బీఎల్‌ఓలు బాధ్యతలను నిర్వహించాలన్నారు.


