ఓర్వకల్లు: మండలంలోని ఉయ్యాలవాడ రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా ఇనుప ఖనిజాన్ని గుట్టుగా అక్రమ రవాణా చేస్తున్నారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని 725, 726 సర్వే నంబర్లలోని అటవీశాఖ, ప్రభుత్వ బంజరు భూములకు సంబంధించి 130 ఎకరాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు భూగర్భ, గనుల శాఖ అధికారులు గుర్తించినట్లు స్థానికుల సమాచారం. ఈ నిక్షేపాలను వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట, కలుగొట్ల గ్రామాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా కొల్లగొడుతున్నట్లు తెలిసింది. రాత్రి వేళ టాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ బృందంతో మైనింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించడంతో అక్రమ మైనింగ్ బాగోతం బయటపడింది. ఈ ప్రాంతంలో వున్న ఖనిజ సంపదను కొందరు అక్రమార్కులు ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే దర్జాగా లూటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజిస్టు దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు దాడులు చేసి తవ్వకాలను అడ్డుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
నందికొట్కూరు: పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన కోట లక్ష్మీదేవి(45) బుధవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గత వారం అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది ఈనెల 15వ తేదీన ఇంటికి చేరుకుంది. మృతిరాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. లక్ష్మీదేవి మృతిపై అనుమానం ఉందని బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన మృతురాలి సోదరుడు అంజి ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ ఖాజపీరా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు
నంద్యాల (వ్యవసాయం): నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ముఖ్యఅతిథిగా ప్రవచనకర్త డాక్టర్ బోలు గద్దె అనిల్ కుమార్ హాజరయ్యారు. నలదమయంతుల కథ అన్ని కాలాల్లోని ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకట్ రెడ్డి, నిత్యాతృప్తా దాసు స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ అన్నపురెడ్డి, నాగ ప్రసాద్ రెడ్డి, బాలశివారెడ్డి, సుబ్బారావు, రాముడు, పెద్ద వీరయ్య, లక్ష్మీదేవి, ఇందిరాదేవి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


