● ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పట్టుబడిన ఇద్దరు దొంగలు
● సీసీ ఫుటేజీ ద్వారా ఛేదించిన పోలీసులు
కర్నూలు: జీవనోపాధి కోసం జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉప్పర వీరేష్, వ్యవసాయం చేస్తున్న ముక్కెర రాముడు మద్యం, జల్సాలకు అలవాటు పడి వృత్తిపై వచ్చే ఆదాయం చాలక సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించారు. ఇద్దరూ కలసి ద్విచక్ర వాహన చోరీలను ఎంచుకున్నారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉప్పర వీరేష్ ద్విచక్ర వాహనం చోరీ చేసి ముక్కెర రాముడుకు అప్పగిస్తే.. అతను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుని ఇద్దరూ కలసి జల్సాలు చేసేవారు. నాలుగు మాసాలుగా సాగిపోతున్న వీరి చోరీల పర్వానికి కర్నూలు సీసీఎస్, మూడో పట్టణ పోలీసులు చెక్ పెట్టారు. పక్కా ఆధారాలతో నిఘా పెట్టి వారి నుంచి రూ.5 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన ఉప్పర వీరేష్ తెర్నెకల్‌లో వివాహం చేసుకుని ప్రస్తుతం అక్కడే నివాసముంటున్నాడు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన ముక్కెర రాముడుతో పరిచయం ఏర్పడి జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి పోలీసుల నిఘాకు చిక్కారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో పార్కు చేసి ఉన్న బుల్లెట్ వాహనం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ రాత్రి చోరీకి గురైంది. ఆసుపత్రిలో పీజీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నిరంజన్ తన బుల్లెట్ వాహనాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మెయిన్ గేట్ వద్ద పార్కు చేసి విధులకు వెళ్లి తిరిగి బయటకు వచ్చేసరికి కనిపించలేదు. దీంతో తన వాహనం చోరీకి గురైందని మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా శుక్రవారం నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని అరుంధతి నగర్ టైల్స్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న కంప చెట్లలో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. వీరి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 6 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి వీరేష్ గతంలో గోనెగండ్ల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో కూడా ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు ఆయా పోలీస్‌స్టేషన్లలో రికార్డులకెక్కాడు. సీఐలు పూల రామకృష్ణ, శేషయ్య, ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డితో కలసి అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా బైకు దొంగలను మీడియా ముందు హాజరుపరచి వివరాలను వెల్లడించారు.


