ఆస్పరి: అధ్వానంగా మారిన గ్రామీణ రోడ్లను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలికంగా నిర్మించుకున్న ఆస్పరి మండలంలోని యాటకల్లు బ్రిడ్జి తెగిపోయింది. తెగిపోయిన యాటకల్లు బ్రిడ్జిని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కురిసిన వర్షాలకు యాటకల్లు బ్రిడ్జి తెగిపోయిందన్నారు. శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్వయంగా తాను అప్పటి కలెక్టర్ రంజిత్ బాషాకు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు తాత్కాలికంగా గరుసు వేసి నిర్మించుకున్నా ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిందన్నారు. ఫలితంగా మండల కేంద్రమైన ఆస్పరికి వచ్చేందుకు యాటకల్లు, తొగలుగల్లు, దొడగొండ, బైలుపత్తికొండ, గార్లపెంట, కై రుప్పల, కారుమంచి, ములుగుందం, డి.కోటకొండ గ్రామాల ప్రజలు అదనంగా మరో 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందన్నారు. రైతులు పండించిన పంటలను ఆటో, ట్రాక్టర్లులో ఆస్పరి మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా యాటకల్లు బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఆయా గ్రామాల ప్రజలతో కలసి ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు.


