50 శాతం సబ్సిడీతో దాణా పంపిణీ | - | Sakshi
Sakshi News home page

50 శాతం సబ్సిడీతో దాణా పంపిణీ

Jun 18 2026 12:47 AM | Updated on Jun 18 2026 12:47 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): పాల ఉత్పత్తిని పెంచేందుకు 50 శాతం సబ్సిడీతో సమీకృత దాణా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. 50 కిలోల ప్యాకెట్‌ పూర్తి ధర రూ.1,110 ఉండగా.. ఇందులో 50 శాతం సబ్సిడీ మినహాయించి రూ.555 పాడి రైతులు చెల్లించాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు 946 మెట్రిక్‌ టన్నుల దాణా కేటాయించారని, ఇందులో మొదట ఎస్సీ, ఎస్టీ రైతులకు పంపిణీ చేస్తామన్నారు. ఎస్సీ రైతులకు 330 టన్నులు, ఎస్టీ రైతులకు 83 టన్నుల ప్రకారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన దాణా ఇతరులకు పంపిణీ చేస్తామని.. వివరాలకు రైతు సేవా కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించాలన్నారు.

వైద్య విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు(సెంట్రల్‌): ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ కర్నూలు బ్రాంచ్‌ మేనేజర్‌ బి.దుర్గా ప్రసాద్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీమా చేసిన ఉద్యోగుల పిల్లలు అందుకు అర్హులని, దేశవ్యాప్తంగా 695 ఎంబీబీఎస్‌, 28 బీడీఎస్‌, 60 బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు కేటాయించినట్లు చెప్పారు. నీట్‌(యూజీ)–2026 ర్యాంకు ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్‌కు జూన్‌ 21వ తేదీలోపు, అలాగే వార్డ్‌ ఆఫ్‌ ఐపీ సర్టిఫికెట్‌ కోసం జూన్‌ 24వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

పీఆర్‌ ఈఈగా శివసాగర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

కర్నూలు(అర్బన్‌): కర్నూలు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఈఈగా జి.శివసాగర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి కల్పించిన నేపథ్యంలో వైఎస్సార్‌ కడప జిల్లాలో డీఈఈగా విధులు నిర్వహిస్తున్న శివసాగర్‌రెడ్డికి ఈఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు నియమించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఇక్కడ ఈఈగా విధులు నిర్వహించిన ఎస్‌.మహేశ్వరరెడ్డి పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి పాణ్యం డీఈఈ నాగిరెడ్డి ఇంచార్జీ ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌ ఈఈగా శివసాగర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పీఆర్‌, పీఐయు డీఈఈలు బండారు శ్రీనివాసులు, కర్రెన్న, నాగిరెడ్డి, ఆర్‌.సతీష్‌కుమార్‌, పీఆర్‌ క్వాలిటీ కంట్రోల్‌ డీఈఈలు ధనిబాబు, భాస్కర్‌రెడ్డి, పత్తికొండ డీఈఈ శేషయ్య, డీఏఓ నాగశేఖర్‌రెడ్డి, ఏఈలు శుభాకాంక్షలు తెలిపారు.

20న పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయం

కర్నూలు(అగ్రికల్చర్‌): పీఎం కిసాన్‌ 23వ విడత ఆర్థిక సహాయం ఈ నెల 20న విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ–కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్‌ సాయం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 2026–27 సంవత్సరానికి మొదటి విడత పెట్టుబడి సాయం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, పీఎం కిసాన్‌ కింద రూ.2వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నా యి. అయితే ఎంత మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

19న యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వేపై గ్రామసభలు

కర్నూలు(అర్బన్‌): యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే డేటా వాలిడేషన్‌పై ఈనెల 19న జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల పరిధిలో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎస్‌డబ్ల్యూ సచివాలయాల అధికారి టీవీ భాస్కర్‌ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సర్వే డేటాను ఆయా సచివాలయాల పరిధిలో ఈనెల 18న పంచాయతీ కార్యదర్శులు/వార్డు అడ్మిన్‌ సెక్రెటరీల ద్వారా ప్రచురిస్తామన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు పోర్టల్‌ ద్వారా నమోదు చేస్తారన్నారు. కుల సంబంధమైన అభ్యంతరాలను సంబంధిత వీఆర్వో, తదుపరి అధీకృత అధికారి ద్వారా ఈనెల 27వ తేదీ వరకు పరిశీలిస్తారన్నారు. కులాలకు సంబంధం లేని అభ్యంతరాలు, ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్‌ సెక్రెటరీల ద్వారా ఈనెల 26వ తేదీ వరకు ప్రాసెస్‌ చేస్తారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement