దేవనకొండ: ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. బుధవారం మండలంలోని కరివేముల గ్రామంలో రైతు సదాశివరావు హై–డెన్సిటీ ప్లాంటేషన్ కింద సాగు చేస్తున్న మామిడి పంటను కలెక్టర్ పరిశీలించారు. సూక్ష్మ నీటిసాగు సదుపాయాలతో సాగు చేస్తున్న ఇలాంటి తోటలు అధిక ఉత్పాదకత సాధించడంలో ఆదర్శమన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా తోటల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం దేవనకొండలో పలువురు రైతులు 16 ఎకరాల్లో సాగు చేస్తున్న హైబ్రిడ్ కొబ్బరితోటతో పాటు మిశ్రమ, అంతర పంటల విధానాలను కలెక్టర్ పరిశీలించారు. ఆ తర్వాత మన గ్రోమోర్ సెంటర్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో యూరియా, ఎరువుల విక్రయాల్లో ఫిర్యాదులు ఉంటే 155251, 8341302863 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో విఫలమైన బండగట్టు, కుంకనూరు, ఆర్‌ఎస్‌కే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.


