కర్నూలు(సెంట్రల్): యోగాంధ్రలో భాగంగా జిల్లా స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరచి 23 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో వారంతా జేసీ నూరుల్ ఖమర్‌ను ఆయన కార్యాలయంలో కలవగా ఆయన అభినందించి రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలని ప్రోత్సహించారు. సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, యోగాంధ్ర, ఆయూష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అమర్‌నాథ్, యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవినాష్ పాల్గొన్నారు.
హోంగార్డులకు బీమా అవసరం
కర్నూలు(టౌన్): ఆరోగ్య భద్రతకు బీమా వంటి ఇన్సూరెన్స్ పాలసీలు హోంగార్డులకు అవసరమని హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో హోంగార్డ్స్ పరేడ్, దర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో 70 మంది హోంగార్డులు హాజరయ్యారు. హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్, ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
మద్దిలేటయ్య హుండీ
ఆదాయం లెక్కింపు
బేతంచెర్ల: మండలపరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.45,73,676 వచ్చింది. స్వామి, అమ్మవార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులు, నిత్యన్నదాన సత్రంలోని హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం చేపట్టారు. దేవదాయశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో మొత్తం 34 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కించగా రూ.45,73,676 నగదు, 66 గ్రాముల బంగారు, 700 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వెల్లడించారు. బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, డోన్, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు.
మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీనపడటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల జిల్లాలో వర్షాలు కురిసిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాల్సి ఉంది. అయితే రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలులో గరిష్టంగా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రతల ప్రకారం 35 డిగ్రీల వరకు మాత్రమే నమోదు కావాల్సి ఉంది. అయితే సాధారణం కంటే 4–5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలులో రాత్రి ఉష్ణోగ్రతలు 28.5 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. నంద్యాల జిల్లాలో ఒకటి రెండు చోట్ల 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


