● ఈనెల 21 అంతర్జాతీయ
యోగా దినోత్సవాన్ని
విజయవంతం చేద్దాం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపు
నంద్యాల: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం ఉదయం నంద్యాల ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునీల్‌షెరాన్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం యోగా నిపుణుల సూచనల మేరకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాభ్యాసం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, అనారోగ్య సమస్యలకు యోగం చక్కని పరిష్కారంగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇప్పటివరకు జిల్లాలో 3.50 లక్షల మంది ‘యోగాంధ్ర’ యాప్, పోర్టల్ ద్వారా స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ఆరోజు జిల్లాలోని ప్రతి గ్రామం, వార్డు, మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగా సాధకులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


