పాణ్యం: మండల కేంద్రంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4 గంటలకు ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందరి భాగం దెబ్బతినగా డోర్ లాక్ కావడంతో ప్రయాణికులు వెనుక భాగంలోని డోర్ నుంచి కిందకు దిగారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఆంజనేయ ట్రావెల్ బస్సు 32 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పాణ్యంలోని ఫ్లైఓవర్ వద్దకు రాగానే ముందు పౌడర్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఎడమవైపు తిరిగే క్రమంలో బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు అద్దం పగిలిపోగా ముందు భాగం దెబ్బతింది. బస్సుల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురై హాహాకారాలు పెట్టారు. బస్సు ముందువైపు ఉన్న డోర్ లాక్ కావడంతో వెనక ఉన్న ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి సిబ్బందిని ఘటనా స్థలానికి పంపి విచారణ చేపట్టారు. హైవే పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలించి రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రయాణికులను పలు బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపించారు. ఇదిలాఉండగా మండలంలో వరుసగా బస్సుల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధికారులు, ప్రజలు హడలిపోతున్నారు.


