పెద్దకడబూరు: మండల కేంద్రం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పక్కన ఉన్న తక్కిడి ఓణి రస్తా (పొలాల రస్తా) మొన్న కురిసిన భారీ వర్షాలకు కొట్టుకొని పోయి గుంతగా మారింది. దారి ప్రమాదకరంగా మారడంతో రైతులు తమ పొలాలకు ఎద్దులబండి కట్టుకొని పోవాలన్నా, ఆ రస్తాగుండా వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకు కూడా కష్టంగా మారింది. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో రైతులు నిత్యం ఆ రహదారిలో వెళ్లాల్సిందే. మరో వర్షం వస్తే ఉన్న కాస్తకూడా తెగిపోతే అటువైపు పొలాలకు దారేలేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహాదారికి మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


