కర్నూలు(అర్బన్): తపాల జీవిత బీమా(పీఎల్‌ఐ), గ్రామీణ తపాల జీవిత బీమా(ఆర్‌పీఎల్‌ఐ) ఏజెంట్లుగా కమీషన్ ప్రాతిపదికన పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికై న అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కొండారెడ్డిబురుజు సమీపంలోని కర్నూలు డివిజన్ తపాల శాఖ కార్యాలయంలో ఈ నెల 30 నుంచి జూలై 3వ తేది వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 7013029312(జి.హరికృష్ణారెడ్డి) నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
మహానంది కొర్ర విత్తనం పంపిణీ
ఎమ్మిగనూరు సెంట్రల్: స్థానిక బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో 20 మంది రైతులకు ఎస్‌ఐఏ–3159 మహానంది కొర్ర రకం విత్తనాలను శాస్త్రవేత్తలు మంగళవారం ఉచితంగా పంపిణీ చేశారు. అఖిల భారత సమన్వయ చిరుధ్యానాల పరిశోధన పథకం, నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల కార్యక్రమంలో భాగంగా విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా కో–ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి మాట్లాడుతూ.. మహానంది కొర్ర పంట కాలం 85 రోజులు కాగా ఎకరానికి 9 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉంటుందన్నారు. ఈ రకాన్ని ఏక పంటగా అలాగే అంతర పంటగా సాగుచేసుకోడవానికి అనుకూలంగా ఉండటంతో పాటు తుప్పు తెగుళ్లను తట్టుకునే లక్షణం కలిగి ఉంటుందన్నారు. అనంతరం సాగు పద్ధతులు, పంట సంరక్షణ చర్యలు, అధిక దిగుబడి సాధించే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటరమణ, డాక్టర సతీష్‌బాబు పాల్గొన్నారు.
జూలై 1 నుంచి వీబీజీ రామ్ జీ అమలు
కర్నూలు(అగ్రికల్చర్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొస్తున్న వీబీజీ రామ్ జీ చట్టం జూలై 1 నుంచి అమలులోకి రానుంది. కొత్త చట్టంపై ఇప్పటికే జిల్లా నీటి యాజామాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. మరో 15 రోజుల్లో కొత్త చట్టం అమలులోకి రానుండటంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు క్రమంగా ముగింపు పలికేందుకు కసరత్తు జరుగుతోంది. 2026–27లో చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కొత్త చట్టానికి లోబడే నిర్వహించనున్నారు. ఇప్పుడు కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పనిదినాలు కల్పిస్తుండగా కొత్త చట్టం ప్రకారం 125 రోజుల పని దినాలు కల్పించనున్నారు.
లింగనిర్ధారణ చేస్తే ఫోన్ చేయండి
● టోల్‌ఫ్రీ నెం.18002332447
కర్నూలు(హాస్పిటల్): పీసీ పీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ 18002332447కు ఫోన్ చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి అక్రమ కార్యక్రమాలను అరికట్టేందుకు అమలులో ఉన్న పీసీ పీఎన్‌డీటీ చట్టం–1994ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. హెల్ప్‌లైన్ ద్వారా అందిన సమాచారం పూర్తి గోప్యంగా ఉంచుతారని, సంబంధిత అధికారులచే తగిన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడ శిశువును రక్షించడం ప్రతి పౌరుని బాధ్యత అని.. మహిళా సంఘాలు, యువజన సంఘాలు, వైద్యనిపుణులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు అందరూ కలిసి పీసీ పీఎన్‌డీటీ చట్టం అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి మంగళవారం కర్ణాటక రాష్ట్రం హుబ్లికి చెందిన కె.ఆనంద బసవరాజ్ రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు పి.దేవికకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.


