కర్నూలు(సిటీ): నగరంలోని నరసింహారెడ్డి నగర్ రైల్వేస్టేషన్ ఎదురుగా పూరి గుడిసెలో నివాసముంటోంది నగిరి శ్రీవల్లి. ఈమె తల్లి నగిరి లక్ష్మి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నగిరి రాముడితో రెండో వివాహమైంది. పెళ్లయిన మూడేళ్లకే చిన్నారి శ్రీవల్లితో పాటు తల్లిని వదిలి ముఖం చాటేశాడు. విధిలేని పరిస్థితుల్లో బిడ్డతో సహా లక్ష్మి తిరిగి కర్నూలుకు చేరుకుంది. రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఖాళీ స్థలంలో ఓ చిన్న హోటల్ ఏర్పాటు చేసుకుంది. అదీ కలిసిరాక, కుమార్తె జీవితం తనలా కాకూడదనే దృఢ నిశ్చయంతో సమీపంలోని హోటల్‌లో పాచీ పని చేయసాగింది. ఇదే సమయంలో కుమార్తె జీవితంలో అక్షర దివిటీ వెలిగించింది. ఒక్కో మెట్టు ఎదుగుతున్న తీరు చూసి మురిసిపోయింది. పదో తరగతి చేరుకున్న తరుణంలో తన కల నెరవేరుస్తుందని చుట్టుపక్కల వారితో ఆనందం పంచుకుంది. ఇంతలో అనారోగ్యం బారినపడి గత ఏడాది డిసెంబర్‌లో మరణించింది. తల్లి పనిచేస్తున్న హోటల్‌లోనే కూలీగా ఉంటున్న మేనత్త విజయలక్ష్మి ఆసరాగా నిలవడంతో విధి ‘పరీక్ష’కు ఎదురొడ్డి నిలిచింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 453 మార్కులు సాధించింది.
కలగా ఉన్నత చదువు
తల్లి మరణంతో జీవితంలో చీకటి అలుముకున్నా చదువులమ్మ ఒడిలో రాణించసాగింది. పదిలో మెరుగైన ఫలితం సాధించినా ఇంటర్మీడియెట్ చదివేందుకు లక్ష్మీ కటాక్షం కరువైంది. విధిలేని పరిస్థితుల్లో తన తల్లి పనిచేసిన హోటల్‌లోనే కూలీగా మారింది. అక్కడికి వచ్చి వెళ్లే వారిలో ఎవరో ఒకరు అక్షర జ్యోతి వెలిగించకపోతారా అని దీనంగా వేడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే గత నెల జిల్లా కలెక్టర్‌ను కలిసి తన దీనగాథను ఏకరువు పెట్టింది. కనీసం కస్తూర్బాలో సీటు ఇప్పించాలని అర్థించింది.
మేము రైల్వేస్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఈ ప్రాంతంలో ఎంతో మంది అనాథలు కళ్లెదుటే అనారోగ్యంతో చనిపోవడం చూశాం. అప్పుడు మా అమ్మ నువ్వు డాక్టర్‌వై ఇలాంటి పేదలకు వైద్యం చేయాలని ఎప్పుడూ చెబుతుండేది. అమ్మ కలను నెరవేర్చడమే నా లక్ష్యం. పదో తరగతి పాసైన సంతోషాన్ని కూడా అమ్మ చూడలేకపోయింది.
– నగిరి శ్రీవల్లి


