ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

వెల్దుర్తి: స్థానిక మేజర్‌ పంచాయతీ సెక్రటరీ (గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌) కే లక్ష్మీనాథ్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ కర్నూలు రేంజ్‌ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన సంధ్యపోగు సతీష్‌ కర్నూలు రోడ్డు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న 13వ వార్డు వీధిలో ప్రభుత్వ స్థలానికి డీ పట్టా పొంది గుడిసె వేసుకున్నాడు. ఈ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అప్రూవ్‌ చేయాలని పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ని సంప్రదించాడు. నిబంధనల పేరుతో కాల యాపన చేస్తూ అప్రూవ్‌ ఫీజుతోపాటు రూ.50 వేలు అదనంగా డిమాండ్‌ చేశాడు. దీంతో సతీష్‌ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో సెక్రటరీని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వల పన్నారు. ఈ మేరకు మంగళవా రం మధ్యాహ్న సమయంలో సెక్రటరీ లక్ష్మీనాథ్‌ తన కారులో కర్నూలు వెళ్తూ హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని ఓ హోటల్‌ వద్ద సతీష్‌ నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం తమ కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్థానిక టీడీపీ నాయకుడి రెకమెండేషన్‌తో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీగా వచ్చి అక్రమాలకు పాల్పడాడు. అప్పటి సర్పంచ్‌ ముత్యాల శైలజ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులు దాదాపు రూ.3 లక్షలు మింగేశాడన్న ఆరోపణతో అధికారులు లక్ష్మీనాథ్‌ను డోన్‌ మండలం దొరపల్లెకు బదిలీ చేశారు. అవినీతికి అలవాటు పడిన లక్ష్మీనాథ్‌ మళ్లీ టీడీపీ నేతలను పట్టుకుని వెల్దుర్తికి బదిలీపై వచ్చాడు. మంగళవారం ఏసీబీ అధికారులు సెక్రటరీని పట్టుకున్నారనే సమాచారం అందుకున్న ఓ టీడీపీ నాయకుడు సంఘటనాస్థలికి చేరుకుని అతడిని కాపాడే ప్రయత్నం చేయడం కనిపించింది.

ఇంటి నిర్మాణ అనుమతులకు

రూ.50 వేలు డిమాండ్‌

ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు

వల వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement