వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు ఎక్కడెక్కడో దాక్కున్న విష పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి. వాటికి అడ్డొచ్చిన వారిని కాటేసి వెళ్లిపోతాయి. దీంతో పలువురు విష పురుగుల కాట్లకు బలికావాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లాలో పాము కాట్లతో పలువురు మృతి చెందారు. ఇలాంటి సమయంలో విషపురుగుల భారి నుంచి కాపాడుకోవడంపై ప్రత్యేక కథనం.
● వర్షాలకు బయటకు వస్తున్న
విషపురుగులు
● జిల్లాలో ఇప్పటికే పలువురికి
పాముకాటు
● బేతంచర్లలోని డోన్ రహదారిలో ఉన్న ఓ నాపరాళ్ల ఫ్యాక్టరీలో పాము కరిచి ఈ నెల 10వ తేదీన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గోసాగోప్ అనే మహిళ మరణించారు.
● బేతంచర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన మధులిఖిత్ అనే బాలుడు ఈ నెల 10న ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటేసింది. తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.
● కోడుమూరు మండలం కల్లపరి హైస్కూల్‌లో వంట గదిలో బియ్యం సంచుల మధ్య నాగు పాము కనిపించింది. పాములు పట్టే వ్యక్తిని పిలిచి పట్టుకొని బయట వదిలేశారు.
కర్నూలు(హాస్పిటల్): మృగశిరకార్తె ప్రారంభం అవుతుండగానే జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. చినుకు నేలరాలగానే వేడిగా ఉన్న భూమి కాస్త చల్లబడుతోంది. ఈ క్రమంలో ఉత్పత్తయ్యే వేడి ఆవిర్లను భరించలేక భూమి పొరల్లోని బొరియల్లో దాక్కున్న విషపురుగులు బయటకు వస్తున్నాయి. వాటికి సురక్షితమనుకున్న ప్రాంతంలో నక్కి ఉంటున్నాయి. అవసరాల రీత్యా మనుషులు వాటిని కదిలించడంతో వెంటనే కాటేస్తున్నాయి.
● ధాన్యపు గాదెలు, గడ్డివాముల వద్ద, పేడ దిబ్బలు, కట్టెలు కుప్పపోసిన ప్రాంతాల్లో పాములు ఎక్కువగా ఉంటాయి.
● పాము కాటుకు గురిగాకుండా రాత్రివేళ విధిగా టార్చిలైట్ తీసుకెళ్లాలి. పొలాల్లో నడిచేటప్పుడు చేతి కర్రతో చప్పుడు చేస్తూ వెళ్లాలి. తప్పనిసరిగా చెప్పులు/బూట్లు ధరించాలి.
విషసర్పం కాటు–లక్షణాలు
తాచుపాము విష ప్రభావం శరీరంలో ప్రవేశించడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. నల్లత్రాచు (కింగ్‌కోబ్రా) విషం ప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. కట్లపాము కాటు బాధ ఒక రకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి.
● కాటు వేసిన ప్రాంతంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది.
● నొప్పి క్రమంగా పైకి పాకుతూ తిమ్మిరిగా అనిపిస్తుంది.
● పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుపోయినట్లు, గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు, కొందరికి నోట్లో చొంగ కారవచ్చు.
● కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు.
పాము కాటేయగానే...
● పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా పక్కనుండే వారు ధైర్యం చెప్పాలి.
● కాటేసిన పాము ఎలాంటిదో గుర్తించాలి. చికిత్స చేసే వైద్యులకూ చెప్పాలి.
● సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
పాము కాటును బట్టి చికిత్స
పాము గాట్లను బట్టి కాటేసింది విషపు పామా కాదా నిర్ధారణ చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తారు. రెండు కోరల మధ్య దూరం, లోతును బట్టి అది ఎలాంటి పామో వైద్యులకు తెలుస్తుంది. పాము కరిచిన చోట నీలంగా, వంగపండు రంగులా మారుతుంది. ఉబ్బులా, లావుగా అవుతుంది. దీన్ని బట్టి విషపు పాముగా గుర్తించవచ్చు. విషపు పాము కాటుకు ప్రథమ చికిత్సగా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి అందులో నుంచి ఏఎస్‌వీ ఇంజెక్షన్ ఇస్తారు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు.
పాముకాటుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స ఉచితంగా అందిస్తున్నాం. అన్ని ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాం. అవసరమైన వారు కర్నూలు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఇండెంట్ పెట్టి ఈ ఇంజెక్షన్లు తీసుకెళ్లవచ్చు. పాము కాటు వేస్తే నాటు వైద్యం జోలికి వెళ్లకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు దక్కించుకోవచ్చు. ఆలస్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం.
– డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్‌ఓ, కర్నూలు


