ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని మున్సిపల్ కుళాయిలకు రంగు మారిన బురదనీరు సరఫరా కావటంతో ప్రజలు అందోళనలు చెందుతున్నారు. మంగళవారం పట్టణంలోని పలు కాలనీల్లో ఉదయం, సాయంత్రం కుళాయిలకు ఎర్రగా రంగుమారి, దుర్వాసన వస్తున్న నీరు సరఫరా అయ్యాయి. పట్టణంలోని ఎస్‌ఎంటీ కాలనీ శారద కమిటీ స్కూల్ లైన్‌లో రంగు మారిన నీటిని పట్టుకుంటే ఉన్న మంచి నీరు పాడైపోయాయని మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ లైన్‌లో గత జనవరి నుంచి నీటి సరఫరా సరిగా లేదని మున్సిపల్ అధికారులు, సచివాలయం ఉద్యోగులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలి
ఎమ్మిగనూరుటౌన్: కుళాయిలకు మట్టి, మురుగుతో కలుషితమైన నీరు వచ్చిందని, ఆ నీటిని తాగితే వ్యాధులబారిన పడతారని స్థానిక సీపీఎం నాయకుడు సురేష్ అన్నారు. పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని, మంచినీరు కనీసం క్లోరినేషన్ చేయకుండా సరఫరా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు .ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడకుండా శుద్ధిచేసిన నీటినే సరఫరా చేయాలని కోరారు.
నీటిని కాచివడబోసి తాగాలి
వర్షాలు కురిసినందున గుడికల్ చెరువుకు కొత్త నీరు వచ్చి చేరిందని, అందువలన పట్టణంలో సరఫరా చేసిన మంచినీటిని కాచి వడబోసి చల్లార్చిన తరువాత తాగాలని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటలో తెలిపారు.


