బకాయిలు కట్టకుంటే బయటే! | - | Sakshi
Sakshi News home page

బకాయిలు కట్టకుంటే బయటే!

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

ఆర్‌యూ హాస్టళ్లకు తాళాలు

మెస్‌ బిల్లులు చెల్లిస్తేనే లోపలికి..

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీలో రోజుకో సమస్య ఉత్పన్నమవుతోంది. విద్యార్థి సంఘాల నాయకుల గొడవలు, అధికారులు, విద్యార్థి సంఘ నేతల మధ్య వాగ్వివాదాలు, విద్యార్థులపై కేసుల నమోదు, యూనివర్సిటీ నుంచి బహిష్కరణ, తాజాగా వర్సిటీ హాస్టళ్లకు తాళాలు వేసి విద్యార్థులను అనుమతించకపోవడం లాంటివి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం, అడ్మిషన్ల సమయంలో ఇలాంటివి తీవ్ర ప్రభావం చూపుతాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. వర్సిటీ మెన్స్‌ హాస్టల్‌లో 600 మంది, ఉమెన్స్‌ హాస్టల్‌లో 450 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు చెల్లించాల్సిన ఫీజు కోట్లలో బకాయి ఉంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో హాస్టళ్ల నిర్వహణ కష్టంగా మారింది.

అధికారుల చర్యలు.. విద్యార్థులకు అవస్థలు

వేసవి సెలవుల అనంతరం వర్సిటీ సోమవారం పునఃప్రారంభమైంది. రెండు రోజులు గడిచినా విద్యార్థులకు భోజనం అందడం లేదు. ఈ నెల 27 నుంచి పీజీ సెమిస్టర్‌, బీటెక్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాస్టల్‌ వసతి, మెస్‌ లేకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. మెస్‌ చార్జీల బకాయిలు చెల్లిస్తేనే హాస్టళ్లు తెరుస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో లైబ్రరీ రూమ్స్‌, హాస్టళ్ల బయటే విద్యార్థులు పడుకోవాల్సి వస్తోంది. తక్షణమే వసతి గృహాలు తెరవాలని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement