● బ్యాంక్ ఖాతా వివరాలను
యాజమాన్యం తప్పుగా నమోదు చేయడంతో జమకాని నిధులు
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని నారాయణ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఆ స్కూల్లో బీఏఎస్ (బెస్ట్ అవైలబుల్ స్కూల్) పథకం కింద ఎంపికై న విద్యార్థుల చదువు ఆటంకంగా మారింది. బీఏఎస్ పథకం కింద 2016 నుంచి నారాయణ పాఠశాలలో ఎం.అజయ్‌కుమార్, ఎం.సుదర్శన్, బి.హస్నమని (10వ తరగతి), జై.రీటాఅనైన్య (7వ తరగతి) చదువుతున్నారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలను పాఠశాల నిర్వాహకులు తప్పుగా నమోదు చేయడంతో పథకం కింద నిధులు బదాలాయింపు కాలేదు. తర్వాత తప్పు తెలుసుకొని బ్యాంకు ఖాతా వివరాలు సరిచేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి పంపగా నేటికి ఫైల్ పెండింగ్‌లో ఉంది. అన్ని కార్పొరేట్ స్కూళ్లకు బీఏఎస్ కింద బకాయిలు మంజూరుకాగా స్థానిక నారాయణ స్కూల్‌కు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోంది. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను కలిసి బీఏఎస్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఉన్నఫలంగా ఫీజులు చెల్లించాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఎమ్మిగనూరు విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ సతీష్‌కుమార్‌ను వివరణ కోరగా విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా నమోదు కావడంతో నిధులు మంజూరు కాలేదని చెప్పారు. వివరాలు సరిచేసి పంపామని, ఇంకా అప్రూవ్ కాలేదని, విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు.


