● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
కర్నూలు: తప్పుడు కేసులు ఎన్ని బనాయించినా ప్రశ్నించడం, పోరాటం చేయడం ఆగబోదని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. పోలీసుల వేధింపులు భరించలేక వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలు చెయ్యిపై కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను నిరసిస్తూ మే 14న కలెక్టరేట్ ముందు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.45 కోట్లు దండుకున్నాడని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి భరత్ ఫిర్యాదు మేరకు కర్నూలు మూడో పట్టణ పోలీసులు సిద్ధార్థ రెడ్డిపై క్రిమినల్, పరువు నష్ట దావా కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విచారించేందుకు పోలీసులు సిద్ధార్థ రెడ్డిని మంగళవారం స్టేషన్‌కు పిలిపించి 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చి మంత్రిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని కోరారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ బయట సిద్ధార్థ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను మంత్రిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలతో కోర్టుకు సమర్పిస్తానని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో 40 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అలాగే యువగళం పాదయాత్ర సందర్భంగా అప్పటి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రూ.600 కోట్లు అవినీతికి పాల్పడినట్లు మంత్రి లోకేష్ ఆరోపించారు. ఇప్పటివరకు వారు వాటికి తగిన ఆధారాలు ఎందుకు చూపలేదని నిలదీశారు. మంత్రి భరత్‌కు సంబంధించిన పరిశ్రమతో ఆ ప్రాంతమంతా కలుషితమవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే మొత్తం రౌడీలతో దౌర్జన్యం చేయించిన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. తనపై గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులు నమోదు చేశారని, వాటన్నింటినీ తప్పుడు కేసులుగా న్యాయస్థానం కొట్టేసిందన్నారు. మంత్రి భరత్‌ను ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు నమోదు చేసి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రశ్నించడం, పోరాటం చేయడం ఆపే ప్రసక్తే లేదన్నారు. తమ అధినాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ఏ సమస్యలౖపైనెనా ఏ ప్రాంతంలోనైనా తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.


