పులి చర్మాల కేసులో నిందితులకు జైలు | - | Sakshi
Sakshi News home page

పులి చర్మాల కేసులో నిందితులకు జైలు

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

3 ఏళ్ల జైలు, రూ.50 వేల జరిమానా

ఆత్మకూరురూరల్‌: నాగార్జునసాగర్‌ – శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని దోర్నాల మండలం ఐనముక్కలలో స్వాధీనమైన రెండు పెద్దపులి చర్మాల స్వాధీనం కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డీడీ విగ్నేష్‌ అపావ్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 2014లో ఎన్‌ఎస్‌టీఆర్‌ పరిధిలోని పెద్దదోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో చిట్టిబాబు అనే వ్యక్తి ఇంటిలో రెండు పెద్ద పులి చర్మాలు, గోర్లను ఆత్మకూరు ప్లయింగ్‌ స్క్వాడ్‌ అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన వన్యప్రాణి వేటగాడు వేముల నాగేశ్వరరావు, సున్నిపెంట నివాసి విజయ్‌ బాబు మార్కాపురం అటవీ డివిజన్‌ ప్రాంతంలో రెండు పెద్ద పులులను తుపాకీతో కాల్చి చంపి వాటి చర్మాలను, గోర్లను చిట్టిబాబు ఇంటిలో భధ్రపరిచి విక్రయించడానికి సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో నిందితులపై అధికారులు కేసు నమోదు చేసి చార్జ్‌ షీట్‌ వేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం 2020లో మార్కాపురం జూనియర్‌ సివిల్‌ జడ్జి నిందితులు ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా ఖరారు చేశారు. అయితే ఈ తీర్పుపై నిందితులు జిల్లా కోర్టుకు అప్పీల్‌ చేసుకున్నారు. కాగా ఈ కేసును సమీక్షించిన మార్కాపురం జిల్లా జడ్జి కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని భావించి అదే తీర్పును ఖరారు చేశారు. దీంతో ముద్దాయిలను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. సాధారణంగా వన్యప్రాణి వేట కేసుల్లో సాక్షాధారాల సమర్పణ లోపాల కారణంగా అటవీ అధికారుల శ్రమ ఫలించదు. కాని ఈ కేసులో శాసీ్త్రయ, సాంకేతిక సాక్ష్యాలతో నేరాన్ని నిర్ధారించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement