● నేర సమీక్షలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి
కర్నూలు: మద్యం, సారా పాత నేరస్తులను బైండోవర్ చేయాలని, అవసరమైన పక్షంలో పీడీ చట్టాన్ని ప్రయోగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆదేశించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో తన కార్యాలయంలో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ నేరాల స్థితిగతులు, వాటి నియంత్రణ, తద్వారా ప్రభుత్వ రాబడికి లక్ష్యాలను సాధించడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మద్యం సరఫరా దుకాణాల వారీగా మే నెలలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ, పెండింగ్ కేసులు తదితర అంశాలపై చర్చించారు. నాటుసారా ప్రభావిత గ్రామాల్లో సారా తయారీ, అమ్మకాలు పునఃప్రారంభం కాకుండా తరచూ దాడులు నిర్వహించాలని సూచించారు. ఏపీ సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలను పర్యవేక్షించాలని, మద్యం షాపులు, బార్లు వ్యాపార పనివేళలను నిరంతరం తనిఖీ చేయాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రాయపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల ఈఎస్‌లు సుధీర్ బాబు, రవికుమార్, ఏఈఎస్‌లు రామకృష్ణారెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడ్, ఉమ్మడి జిల్లాల సీఐలు సమావేశంలో పాల్గొన్నారు.


